కదిలే అంబులెన్స్‌లో 16 ఏళ్ల బాలికపై అత్యాచారం.. రేపిస్టుకు స‌హ‌క‌రించిన బాధితురాలి అక్క‌, బావ‌

మధ్యప్రదేశ్‌లోని మౌగంజ్ జిల్లాలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది.

By Medi Samrat  Published on  29 Nov 2024 4:50 AM GMT
కదిలే అంబులెన్స్‌లో 16 ఏళ్ల బాలికపై అత్యాచారం.. రేపిస్టుకు స‌హ‌క‌రించిన బాధితురాలి అక్క‌, బావ‌

మధ్యప్రదేశ్‌లోని మౌగంజ్ జిల్లాలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. కదులుతున్న అంబులెన్స్‌లో 16 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. '108' అత్యవసర సేవ కింద పనిచేసే అంబులెన్స్‌లో ఈ సంఘటన జరిగింది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి నలుగురు నిందితులలో ఇద్దరిని అరెస్టు చేశారు. ఇందులో డ్రైవర్ కూడా ఉన్నాడు.

డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ (రేవా రేంజ్) సాకేత్ పాండే మాట్లాడుతూ.. బాలిక తన సోదరి, బావతో కలిసి అంబులెన్స్‌లో ప్రయాణిస్తోంది (వారిలో ఎవరూ రోగులు కాదు). ఈ ముగ్గురు కాకుండా.. డ్రైవర్, అతని సహోద్యోగి అంబులెన్స్‌లో ఉన్నారు. బాధితురాలి సోద‌రికి, ఆమె భ‌ర్త‌కు అంబులెన్స్‌ డ్రైవ‌ర్ తెలుసు.

మార్గమధ్యంలో యువతి సోదరి, ఆమె బావ నీళ్లు తెచ్చే సాకుతో వాహనం దిగారు. ఆ స‌మ‌యంలో వారి కోసం వేచి ఉండకుండా.. అంబులెన్స్ డ్రైవర్ వేగంగా వాహ‌నాన్ని ముందుకు పోనిచ్చాడు. తర్వాత డ్రైవర్‌తో కలిసి ప్రయాణిస్తున్న సహచరుడు రాజేష్ కేవత్.. నిర్జన ప్రాంత‌లో కదులుతున్న అంబులెన్స్‌లో తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు పేర్కొంది. ఈ ఘ‌ట‌న నవంబర్ 22న జ‌రిగిన‌ట్లు వెల్ల‌డించింది. రాత్రంతా బాలికను బందీగా ఉంచిన తర్వాత మరుసటి రోజు ఉదయం నిందితులిద్దరూ ఆమెను రోడ్డు పక్కన పడేసినట్లు డీఐజీ తెలిపారు. ఇంటికి చేరుకున్న తర్వాత బాధితురాలు తన తల్లికి మొత్తం ఘటనను వివరించింది. నేరంలో తన సోదరి, బావ ప్ర‌మేయం ఉంద‌ని బాధితురాలు ఆరోపించింది.

ఈ ఘటన వల్ల సమాజంలో కుటుంబ పరువు పోతుందనే భయంతో బాలిక తల్లి రెండు రోజులు పోలీసులను సంప్రదించలేదు. చివరకు నవంబర్ 25న బాలిక, ఆమె తల్లి పోలీసులను ఆశ్రయించారని.. వారి ఫిర్యాదుపై కేవత్‌తో సహా నలుగురిపై కేసు నమోదు చేశామని పాండే చెప్పారు. అంబులెన్స్ డ్రైవర్ వీరేంద్ర చతుర్వేది, రేపిస్ట్ రాజేష్‌ కేవత్‌లను బుధవారం అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. నేరానికి సహకరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలిక సోదరి, ఆమె బావ‌ను పట్టుకోవడానికి అన్వేషణ ప్రారంభించినట్లు పాండే తెలిపారు. నిందితులందరిపై లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం, ఇండియన్ జ్యుడీషియల్ కోడ్ కింద కేసు నమోదు చేశారు.

Next Story