మీరట్ : పట్టపగలు కొందరు వ్యక్తులు ఓ మహిళపై దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొంతమంది వ్యక్తులపై ఎఫ్‌ఐఆర్ (ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్) నమోదు చేయబడింది. బాధితురాలిని ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలోని మానసిక రోగుల హాస్పిటల్‌లో చేర్చినట్లు మీరట్ పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం, సెప్టెంబర్ 19న.. మానసిక వికలాంగ మహిళపై కొంతమంది పురుషులు శారీరకంగా దాడి చేశారు. ఈ ఘటన దౌరాల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఘటనా స్థలం నుంచి మహిళను రక్షించి వైద్య పరీక్షల నిమిత్తం తరలించినట్లు పోలీసులు తెలిపారు.
ఈ వీడియో క్లిప్‌లో ఇద్దరు పురుషులు కనికరం లేకుండా ఒక మహిళను నేలపై లాగుతూ.. ఆమెపై దాడి చేయడం చూడచ్చు. ఆమె సహాయం కోసం వేడుకుంటూ, కేకలు వేయడం కూడా వీడియోలో రికార్డు అయింది. ప్రజలు చుట్టూ గుమికూడి ఆమెను చూస్తున్నారు. కొందరు తమ మొబైల్ ఫోన్ కెమెరాలలో సంఘటనను బంధించారు, కానీ ఎవరూ ఆపడానికి, బాధితురాలికి సహాయం చేయడానికి ముందుకు రాలేదు.
బారాబంకీ జిల్లాలో :
ఉత్తర్ ప్రదేశ్ లోని బారాబంకీ జిల్లాలో బలవంతంగా మద్యం తాగించి ఓ వివాహితపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన బయటకు వచ్చింది. సెప్టెంబర్ 17 జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎవరికైనా చెబితే చంపేస్తామని ఆ యువకులు బెదిరించడంతో మహిళ ఇన్నిరోజులు మౌనంగా ఉంది. చివరకు ధైర్యం కూడగట్టుకుని భర్తకు నిజం చెప్పగా, ఇద్దరు కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.