బోరబండ యువకుడి హత్య కేసును ఛేదించిన పోలీసులు
బోరబండకు చెందిన 21 ఏళ్ల యువకుడు మహ్మద్ సబిల్ హత్య వెనుక ఉన్న మిస్టరీని మెదక్ పోలీసులు ఛేదించారు.
By Medi Samrat
బోరబండకు చెందిన 21 ఏళ్ల యువకుడు మహ్మద్ సబిల్ హత్య వెనుక ఉన్న మిస్టరీని మెదక్ పోలీసులు ఛేదించారు. శివంపేటలో అతని బంధువుతో సహా ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు.
తూప్రాన్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డిఎస్పీ) జె.నరేందర్ గౌడ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, అరెస్టు చేసిన వ్యక్తులను సయ్యద్ అఫ్సర్ (34), అతని స్నేహితుడు పి. సంతోష్ (39) గా గుర్తించామని, ఇద్దరూ సంగారెడ్డి జిల్లాకు చెందినవారని తెలిపారు. కారు డెంటరింగ్, పెయింటింగ్ కార్మికుడైన సబిల్, అస్ఫర్ బంధువును ప్రేమించి 15 రోజుల క్రితం ఆమెతో పారిపోయాడని ఆరోపణలు ఉన్నాయి. అమ్మాయి మైనర్ అని, ఆమె మేజర్ అయిన తర్వాత వివాహం జరుగుతుందని చెప్పి అమ్మాయి కుటుంబ సభ్యులు ఒప్పించిన తర్వాత, సబిల్ ఆ అమ్మాయిని బోరబండలోని ఆమె ఇంట్లో దింపాడు.
సబిల్ ఆ అమ్మాయితో తీసుకున్న ఫోటోలు తన దగ్గర ఉన్నాయని, వాటిని వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో అప్‌లోడ్ చేస్తానని బెదిరించడం మొదలు పెట్టాడని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ విషయమై అఫ్సర్‌ను బెదిరించడం కొనసాగించాడు. సబిల్ వైఖరితో విసిగిపోయిన అఫ్సర్, అతన్ని అంతమొందించాలని నిర్ణయించుకుని, సంతోష్ సహాయం తీసుకున్నాడు. పథకం ప్రకారం, అఫ్సర్ సబిల్‌కు ఫోన్ చేసి, తన కారులో తనతో పాటు హైదరాబాద్‌కు రావాలని కోరాడు. సబిల్ అంగీకరించిన తర్వాత, అఫ్సర్ తులసి నగర్‌లోని న్యూ బ్రిడ్జి వద్ద అతన్ని తీసుకెళ్లి మఖ్దుంపూర్ గ్రామ శివార్లకు చేరుకుని ఫోటోలను డిలీట్ చేయమని కోరాడు.
సబిల్ ఒప్పుకోకపోవడంతో అఫ్సర్ అతని తలను గోడకు బలంగా కొట్టాడు. కుప్పకూలిన తర్వాత, అఫ్సర్ సబిల్ తలను బండరాయితో కొట్టడంతో అక్కడికక్కడే మరణించాడు. మఖ్దుంపూర్ గ్రామంలో మృతదేహం గురించి పంచాయతీ కార్యదర్శి నుండి పోలీసులకు సమాచారం అందిన తర్వాత ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. మృతదేహాన్ని గుర్తించిన తర్వాత, పోలీసులు కేసు నమోదు చేసి, శివంపేటలో అఫ్సర్, సంతోష్‌లను అరెస్టు చేశారు.