హైదరాబాద్: హయత్ నగర్ పరిధిలోని ఆర్టీసీ కాలనీ వద్ద సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న సమయంలో అతి వేగంగా వచ్చిన కారు ఎంబీబీఎస్ విద్యార్థిని ఐశ్వర్యను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐశ్వర్య అక్కడికక్కడే మృతి చెందగా, ఆమెతో పాటు ఉన్న తండ్రికి తీవ్ర గాయాలయ్యాయి.
స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు గాయపడిన తండ్రిని మెరుగైన చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మృతురాలు ఐశ్వర్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదానికి కారణమైన కారును పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతురాలిని మహబూబ్‌నగర్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో చివరి సంవత్సరం వైద్య విద్యార్థిని యెంసాని ఐశ్వర్యగా గుర్తించారు.