సిద్దిపేట జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. భర్త పెట్టే వేధింపులు తాళలేక ఓ భార్య తన రెండేళ్ల కుమారుడికి నిప్పంటించి తాను ఆత్మహత్య చేసుకుంది. జిల్లా పరిధిలోని కొండపాక మండలం సిర్సనగండ్ల గ్రామంలో స్వామి అనే వ్యక్తి తన భార్య నవితతో నివసిస్తున్నాడు. వీరికి 10 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. భార్య నవిత అమ్మగారిది చేర్యాల మండలం వేచరేణి. వీరికి రెండేళ్ల కుమారుడు మణిదీప్ ఉన్నాడు. కూలీ పనులు చేసుకుంటూ వీరు జీవనం సాగిస్తున్నారు. కొన్ని సంవత్సరాల తర్వాత భార్య నవితపై భర్త స్వామికి అనుమానం మొదలైంది. నవిత ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న భర్త స్వామి.. ఆమెను తరచూ వేధింపులకు గురి చేసేవాడు.
వివాహేతర సంబంధం కొనసాగిస్తోందన్న అనుమానంతో ఆమెను తీవ్రంగా వేధించసాగాడు. ఈ విషయమై పలు మార్లు భార్య భర్తలకు గొడవలు జరిగాయి. కుటుంబ కలహాలు రేగడంతో.. వారం రోజుల క్రితం కుల పెద్దలు పంచాయతీ చేసి ఇద్దరికి నచ్చజెప్పి పంపారు. శనివారం నాడు పత్తి ఏరేందుకు చేనుకు రావాలని నవితను స్వామి కోరాడు. దీంతో ఆమె రానని చెప్పింది. ఇది ఇద్దరి మధ్య గొడవకు దారితీయగా.. భార్యపై భర్త స్వామి చేయిచేసుకున్నాడు. అనంతరం స్వామి చేను దగ్గరికి వెళ్లాడు. ఈ క్రమంలోనే తీవ్ర మనస్తాపం చెందిన భార్య నవిత ఇంట్లో ఎవరూ లేని టైమ్ చూసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
తన కుమారుడు మణిదీప్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించి తాను కూడా నిప్పంటించుకుంది. ఇంతలోనే ఇంట్లో నుండి పొగలు రావడాన్ని గమనించిన స్థానికులు.. వెంటనే తలుపులు పగలగొట్టి చూశారు. అప్పటికే ఇద్దరూ విగతజీవులై కనిపించారు. తన కూతురు ఆత్మహత్యకు స్వామినే కారణమని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.