ప్రాణం తీసిన ప్రేమ.. హిజ్రా బలవన్మరణం.. ఇంట్లో పూజ ఉందని చెప్పి..

Married trans woman commits suicide. హైదరాబాద్‌లో ఓ హిజ్రా ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ప్రేమించి వివాహం చేసుకున్న వ్యక్తి వదిలి వెళ్లాడని మనస్తాపానికి గురైంది.

By అంజి  Published on  23 Nov 2021 5:56 AM GMT
ప్రాణం తీసిన ప్రేమ.. హిజ్రా బలవన్మరణం.. ఇంట్లో పూజ ఉందని చెప్పి..

హైదరాబాద్‌లో ఓ హిజ్రా ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ప్రేమించి వివాహం చేసుకున్న వ్యక్తి వదిలి వెళ్లాడని మనస్తాపానికి గురైంది. తాను ఉంటున్న రూమ్‌లో ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకుని హిజ్రా ఆత్మహత్య చేసుకున్న ఘటన మీర్‌పేట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. భద్రాచలంకు చెందిన హిజ్రా మొదపూరపు గుణ అలియాస్‌ స్వప్న (24) మీర్‌పేట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఓ ఫ్లాట్‌తో తన ఫ్రెండ్స్‌తో కలిసి నివసిస్తోంది. ఈ క్రమంలోనే నల్గొండ జిల్లా నిడమనూరుకు చెందిన గోశెట్టి నిషాంత్‌తో 3 నెలల క్రితం పరిచయం ఏర్పడింది. నిషాంత్‌ బైక్‌ మెకానిక్‌గా పని చేస్తున్నాడు.

వీరి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఆ తర్వాత 2 నెలల క్రితం ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ఓ రోజు తన తండ్రి నుంచి ఫోన్‌ వచ్చిందని, ఇంట్లో పూజ ఉందని రమ్మంటున్నారని ఇంటికి వెళ్లొస్తానని చెప్పి.. నిషాంత్‌ తన సొంతురూకు వెళ్లాడు. హిజ్రాను పెళ్లి చేసుకున్న విషయం నిషాంత్‌ తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో నిషాంత్‌ను హైదరాబాద్‌కు రానివ్వలేదు. జరిగిన విషయాన్ని నిషాంత్‌ తన భార్య స్వప్నకు ఫోన్‌లో చెప్పాడు. ఆదివారం నాడు స్వప్న నిడమనూరు వెళ్లి చూడగా నిషాంత్‌కు ఇంటికి తాళం వేసి ఉంది.

దీంతో స్వప్న నిడమనూరు పీఎస్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు నిషాంత్‌, వారి తల్లిదండ్రులను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించారు. ఆ తర్వాత స్వప్న అంటే తనకు ఇష్టం లేదని నిషాంత్‌ పోలీసుల ముందు చెప్పాడు. దీంతో మనస్తాపానికి గురైన స్వప్న.. మీర్‌పేట్‌లోని తన రూమ్‌లో ఉదయం ఎవరూ లేని టైమ్‌ చూసుకుని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. స్వప్న స్నేహితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story
Share it