మహరాష్ట్ర పూణెలోని స్వర్గేట్ బస్టాండ్ వద్ద జరిగిన అత్యాచారం కేసులో నిందితుడు దత్తాత్రేయ రాందాస్ గాడేను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని పూణేలోని షిరూర్ తహసీల్ నుంచి శుక్రవారం అర్ధరాత్రి పూణే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ప్రస్తుతం అతడిని విచారిస్తున్నారు. నిందితుడు మంగళవారం ఉదయం బస్సులో మహిళపై అత్యాచారం చేసి పారిపోయాడు. నిందితుడి గురించి సమాచారం రావడంతో పూణె జిల్లాలోని షిరూర్ తహసీల్‌లోని చెరకు పంట ప్రాంతాల్లో గురువారం సెర్చ్ ఆపరేషన్‌లో భాగంగా పోలీసులు స్నిఫర్ డాగ్‌లు, డ్రోన్‌లను మోహరించారు. ఈ క్రమంలోనే ఆకలికి తట్టుకోలేక నిందితుడు ఒక ఇంటికి వెళ్లాడు. ఆ ఇంటి యజమాని సమాచారం ఇవ్వడంతో పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు.
కాగా.. నిందితుడిని పట్టుకునేందుకు 13 పోలీసు బృందాలు రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో సోదాలు చేపట్టాయి. అరడజను కేసుల్లో రాందాస్ గాడే ఇప్పటికే నిందితుడిగా ఉన్నాడు. అతడు ఒక నేరంలో 2019లో బెయిల్ పొంది బయట ఉన్నాడు. నిందితుడి గురించి సమాచారం ఇస్తే లక్ష రూపాయల రివార్డు ఇస్తామని పోలీసులు ప్రకటించారు. అతనిపై పూణే, అహల్యానగర్‌లో దొంగతనం, దోపిడీ, స్నాచింగ్‌ల కేసులు నమోదయినట్లు పోలీసులు గుర్తించారు.
మంగళవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. సతారా జిల్లాలోని ఫాల్తాన్‌కు వెళ్లే బస్సు కోసం మహిళ బస్టాండ్‌లో నిలబడి ఎదురుచూస్తోంది. నిందితుడు ఆమెను మాటల్లోకి దించి బస్టాండ్‌లో ఆగి ఉన్న మరో ఖాళీ బస్సులోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం కూరగాయలు నింపిన ట్రక్కులో నిందితుడు పారిపోయినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలోనే నిందితుడు తన ఇంటికి వెళ్లి తన బట్టలు, బూట్లు మార్చుకున్నట్లు పోలీసులు తెలిపారు. అలాంటి వారిని ఉరితీయాలని డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే అన్నారు.
పూణే రేప్ కేసు రాజకీయంగా చర్చనీయాంశంగా మారుతోంది. శివసేన (యుబిటి), ఎన్‌సిపి (శరద్‌చంద్ర పవార్) కార్యకర్తలు గురువారం స్వర్గేట్ బస్టాండ్‌ను ధ్వంసం చేసి, బస్టాండ్ భద్రతలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులను తొలగించాలని డిమాండ్ చేశారు.