దేశ రాజధాని ఢిల్లీలోని కశ్మీర్ గేట్ ప్రాంతంలో ఓ మహిళా క్యాబ్ డ్రైవర్ ను బెదిరించి.. ఆమె దగ్గరున్న డబ్బు మొత్తాన్ని దోచుకోవాలని ఓ యువకుడు భావించాడు. అయితే అతడి ప్రయత్నం విఫలమైంది. గుర్తుతెలియని వ్యక్తి మహిళా క్యాబ్ డ్రైవర్ దగ్గర చోరీకి ప్రయత్నించాడని ఢిల్లీ పోలీసులు మంగళవారం ధృవీకరించారు. దాడి చేసిన వ్యక్తికి ఆమె గట్టిగా బుద్ధి చెప్పడంతో అతడు అక్కడి నుండి పారిపోయాడు. జనవరి 9న తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఒక మహిళ నడుపుతున్న క్యాబ్‌లో దోపిడీకి ప్రయత్నించినట్లు పోలీసు కంట్రోల్ రూమ్‌కు కాల్ వచ్చింది. వెంటనే పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది.
మీడియాతో డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ (నార్త్) సాగర్ సింగ్ కల్సి మాట్లాడుతూ, "సమయ్‌పూర్ బద్లీ నివాసి ప్రియాంక క్యాబ్ డ్రైవర్ గా తన విధుల్లో ఉండగా.. క్యాబ్ అద్దాన్ని రాయితో పగులగొట్టి, మొబైల్ లాక్కోడానికి ఓ వ్యక్తి ప్రయత్నించాడని పోలీసులకు చెప్పింది." అని అన్నారు. ఆమె ఎదురుతిరిగి అక్కడి నుండి అతడు పారిపోయేలా చేసింది. గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. పోలీసులు సంఘటనపై దర్యాప్తు ప్రారంభించారు, సమీపంలోని సీసీటీవీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తూ ఉన్నారు.