కట్ని (మధ్యప్రదేశ్): మధ్యప్రదేశ్‌లోని కట్నిలో ఒక ఆలయంలో ప్రార్థనలు చేస్తున్న వ్యక్తి గుండెపోటుతో మరణించిన సంఘటన సంచలనం సృష్టించింది. గురువారం జరిగిన ఈ సంఘటన యొక్క CCTV ఫుటేజీ వైరల్ అవుతూ ఉంది. రాజేష్ మెహానీ అనే సాయి భక్తుడు ఆలయంలోని విగ్రహాన్ని తాకిన తరువాత ప్రార్థన చేయడానికి ముందు కూర్చున్నాడు.. కానీ అతడు లేవలేదు. అక్కడే ఉన్న భక్తులు ఆయన్ను చూసి.. కదలిక లేకపోవడాన్ని గుర్తించారు. సుమారు 15 నిమిషాల పాటు ఆ వ్యక్తి స్పందించకపోవడంతో ఆలయంలోని ఇతర భక్తులు పూజారికి ఫోన్ చేశారు. ఆ తర్వాత అతడిని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మెహానీ మెడికల్ స్టోర్‌ను నడుపుతూ ప్రతి గురువారం ఆలయానికి వెళ్లేవారు. సైలెంట్ మయోకార్డియల్ ఇన్‌ఫార్క్షన్ (SMI) అని పిలువబడే సైలెంట్ హార్ట్ ఎటాక్ కారణంగా అతడు చనిపోయాడని నిపుణులు చెబుతున్నారు.