మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేసులో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. జనగాం జిల్లా జఫర్‌గఢ్ మండలం గర్నెపల్లి గ్రామానికి చెందిన గబ్బెట చంద్రయ్య (41)ను దోషిగా నిర్ధారించిన పోక్సో ఫాస్ట్ ట్రాక్ కోర్టు న్యాయమూర్తి పి. వసంత్ పాటిల్.. అతనికి 20 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.2,000 జరిమానా విధించారు. 2015 డిసెంబర్ 8న మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. చంద్రయ్యపై 2016 జనవరి 11న జిల్లాలోని గూడూరు పోలీస్ స్టేషన్‌లో అత్యాచారం కేసు నమోదు అయింది. దీంతో చంద్రయ్యను పోలీసులు అరెస్టు చేశారు.
అప్పటి మహబూబాబాద్ డీఎస్పీ రాజమహేంద్ర నాయక్ ఈ కేసుపై విచారణ జరిపి సకాలంలో పోక్సో ప్రత్యేక కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. సాక్షులను కూడా కోర్టు ముందు హాజరుపరచగా వారందరూ ప్రాసిక్యూషన్‌కు సహకరించారు. వాదనల అనంతరం దోషి గబ్బెట చంద్రయ్యకు 20 ఏళ్ల జైలుశిక్ష, రూ.2000 జరిమానా విధిస్తూ ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు జడ్జి పి వసంత్ పాటిల్ ఈరోజు (సెప్టెంబర్ 9, 2022) తుది తీర్పును వెలువరించారని ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు.