ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో కేవలం రూ. 1,500 కోసం ఓ వ్యక్తి తన స్నేహితుడినే అత్యంత దారుణంగా హత్య చేశాడు. రాహుల్ (35) అనే వ్యక్తి ఫుట్‌పాత్‌పై ఉంటూ జీవనం సాగించేవాడు. గురువారం ఉదయం 9 గంటల సమయంలో ఉత్తరాఖండ్‌కు చెందిన అతని స్నేహితుడు రవీంద్రతో అతనికి గొడవ జరిగింది. వీరిద్దరి మధ్య ఉన్న రూ. 1,500 నగదు లావాదేవీల విషయంలో మొదలైన ఈ చిన్న వాగ్వాదం దాడులు చేసుకునే వరకు వెళ్లింది.
రవీంద్ర అక్కడే ఉన్న ఒక బండరాయితో రాహుల్ తలపై బలంగా కొట్టాడు. తీవ్ర గాయాలపాలై స్పృహ కోల్పోయిన రాహుల్‌ను తీసుకెళ్లి పక్కనే ఉన్న రోడ్డు పక్కన మురుగు కాల్వలో పడేశాడు. తలకు బలమైన గాయం కావడంతో పాటు నీట మునగడంతో రాహుల్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. దారిన వెళ్తున్న వారు మృతదేహాన్ని గమనించి అధికారులకు సమాచారం ఇవ్వడంతో.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు.