భార్యపై అత్యాచారం చేసిన స్నేహితుడు.. ఇంటికి పిలిచి భయంకరమైన శిక్ష వేసిన భర్త
మహారాష్ట్రలో ఓ ఆశ్చర్యకరమైన కేసు వెలుగులోకి వచ్చింది. అందిన సమాచారం ప్రకారం..
By Medi Samrat Published on 15 Jan 2025 2:59 PM ISTమహారాష్ట్రలో ఓ ఆశ్చర్యకరమైన కేసు వెలుగులోకి వచ్చింది. అందిన సమాచారం ప్రకారం.. బద్లాపూర్‌లో తన భార్యపై అత్యాచారం చేశాడని ఓ వ్యక్తిని హత్య చేసినందుకు 30 ఏళ్ల నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ వ్యక్తిని నిందితుడు తన ఇంటికి పార్టీ కోసం ఆహ్వానించి సుత్తితో దాడి చేసి హత్య చేశాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు మహిళపై అత్యాచారానికి పాల్పడి.. భర్తకు చెప్పవద్దని బెదిరించాడు. అయితే ఆ మహిళ ధైర్యంగా తనపై అత్యాచారం జరిగిన విషయాన్ని భర్తకు చెప్పింది. జనవరి 11న నిందితుడు నరేష్ శంభు భగత్ (30) ఇంట్లో సుకాంత్ శత్రుఘ్న పరిదా (29) చనిపోయాడని.. బద్లాపూర్ ప్రాంతంలోని తన నివాసంలో జరిగిన హత్య గురించి స్వయంగా తానే సమాచారమిచ్చాడని పోలీసులు తెలియజేశారు.
పథకం ప్రకారం.. జనవరి 10న భగత్.. పరిదాను తన ఇంటికి పిలిపించాడని బద్లాపూర్ ఈస్ట్ పోలీస్ స్టేషన్ సీనియర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ కిరణ్ బల్వాడ్కర్ తెలిపారు. మద్యం సేవించిన పరిదా.. భగత్ ఇంట్లోనే ఉండగా.. ఆ తర్వాత నిందితుడు భగత్.. పరిదా తలపై సుత్తితో పలుసార్లు మోదాడు. మరుసటి రోజు ఉదయం భగత్ బాత్రూంలో పడి పరిదా చనిపోయాడని పోలీసులకు సమాచారమిచ్చాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించి ప్రాథమికంగా ప్రమాదవశాత్తు మృతిగా కేసు నమోదు చేశారు.
పోలీసులు విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం.. కేసు దర్యాప్తులో పోలీసులు అనేక కోణాలలో ఆధారాలను పరిశీలించారు. అనుమానంతో భగత్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భగత్.. మృతుడు తరచూ తన ఇంటికి వచ్చి తన భార్యను వేధించేవాడని.. ఇది దంపతుల మధ్య గొడవలకు దారితీసిందని పోలీసులకు చెప్పాడు. పరిదా ప్రవర్తనతో విసిగిపోయిన భగత్ అతడిని ఎలాగైపా హత్య చేయాలని ప్లాన్ చేశాడు. జనవరి 10వ తేదీ రాత్రి నిందితుడు అతడిని తన ఇంటికి పిలిచి మద్యం తాగించి, ఆపై సుత్తి, ఇనుప రాడ్‌తో తలపై కొట్టానని, ఆ తర్వాత అతడు చనిపోయాడని పోలీసులు తెలిపాడు. నిందితుడిని అరెస్టు చేశామని, అతనిపై ఇండియన్ జస్టిస్ కోడ్ (బిఎన్‌ఎస్) సెక్షన్ 103 (హత్య) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.