అత్త, భార్యను చంపిన వ్యక్తి.. హత్యలకు 'రీల్స్' కూడా ఓ కారణం
ఓ వ్యక్తి తన భార్య, అత్తను అతి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన త్రిపురలో చోటు చేసుకుంది
By M.S.R Published on 14 Oct 2024 7:01 AM GMTఓ వ్యక్తి తన భార్య, అత్తను అతి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన త్రిపురలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి వెస్ట్ త్రిపుర పోలీసులు సెపాహిజాలా జిల్లాలోని మధుపూర్‌కు చెందిన సమర్జిత్ చౌదరిని అరెస్టు చేశారు. మాంసం విక్రేత అయిన 38 ఏళ్ల సమర్జిత్ చౌదరి ఆదివారం తెల్లవారుజామున తన భార్య, అత్తని చంపేశాడు. ఈ డబుల్ మర్డర్ జరిగిన గంట వ్యవధిలోనే అతడిని పోలీసులు అరెస్టు చేశారు. సంఘటన జరిగిన వెంటనే హత్యకు సంబంధించిన క్లూస్ ద్వారా నిందితుడిని వెంటనే అరెస్టు చేశారు.
నిందితుడు నేరం అంగీకరించడమే కాకుండా ఈ ఘటనకు సంబంధించిన వివరాలను కూడా పోలీసులకు తెలిపాడు. కుటుంబ కలహాల కారణంగా, సంబంధాలు దెబ్బతిన్నాయని ఆ కారణంగానే ఈ సంఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. అగర్తలాలోని అమ్తాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని నేతాజీనగర్ ప్రాంతానికి చెందిన తనుశ్రీ ఆచార్జీ (34)ని సమర్జిత్ వివాహం చేసుకున్నాడు. దుర్గాపూజ చివరి రోజున తనుశ్రీ, ఆమె తల్లి గుడికి వెళ్లారు. వాళ్లు ఇంటికి రాగానే హత్య చేయాలని సమర్జిత్ నిర్ణయించుకున్నాడు. రాత్రి నుండి బాధితుల కోసం గేటు దగ్గర పదునైన కట్టర్‌తో వేచి ఉన్నాడు. తనుశ్రీ, ఆమె తల్లి సోమ ఆచార్జీ ఇద్దరూ గేట్‌లోకి ప్రవేశించగానే.. సమర్జిత్ పదునైన కట్టర్‌తో సోమను బలంగా కొట్టాడు. కింద పడిపోయిన ఆమెను పదేపదే కొట్టడంతో అక్కడికక్కడే మరణించింది. తల్లిని కాపాడే క్రమంలో తనుశ్రీ తీవ్రంగా గాయపడి మరణించింది. నిందితుడు హత్య చేసిన వెంటనే అక్కడి నుంచి పారిపోయాడని పోలీసులు తెలిపారు.
సమర్జిత్, తనుశ్రీకి సుమారు 17 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒకరు పదో తరగతి, మరొకరు నాలుగో తరగతి చదువుతున్నారు. రెండేళ్ల క్రితం తనుశ్రీ తన పిల్లలను తండ్రి వద్ద వదిలి నేతాజీనగర్‌లోని తన తల్లిదండ్రుల ఇంటిలో ఉంటోంది. ఆమె విడాకుల కోసం దాఖలు చేసింది. తన భార్యను ఆమె తల్లి సోమ ఆచార్జీ (51) తప్పుదారి పట్టించిందని కక్ష పెంచుకున్నాడు సమర్జిత్. తనుశ్రీ సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ ఉండడం కూడా సమర్జిత్‌కు కోపం తెప్పించింది. అందుకే ఇద్దరినీ హత్య చేశాడు. చివరికి తప్పించుకోవాలని ప్రయత్నించగా ఘటన గురించి తెలిసిన గంట సమయంలోనే సమర్జిత్ ను పట్టుకున్నారు పోలీసులు.