అమ్మాయిలు, మహిళల్ని వేధించి.. బ్లాక్‌మెయిల్ కు పాల్పడుతూ..
Man Held for Cheating Women on Social Media. అమ్మాయిలకు మాయమాటలు చెప్పి ప్రేమలోకి దించి వారితో చాటింగ్ చేస్తూ.. వారి
By Medi Samrat Published on 2 Aug 2021 10:34 AM GMT
అమ్మాయిలకు మాయమాటలు చెప్పి ప్రేమలోకి దించి వారితో చాటింగ్ చేస్తూ.. వారి అర్ధనగ్న చిత్రాలను, వీడియోలను సేవ్ చేసుకుని, బ్లాక్‌మెయిల్ కు పాల్పడుతున్న ఓ మోసగాడిని కడప పోలీసులు అరెస్టు చేశారు. అతడి వద్ద రూ.1.26 లక్షల నగదు, 30 గ్రాముల నగలు స్వాధీనం చేసుకున్నారు. అతడిపై రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు పోలీసు స్టేషన్ లలో కేసులు నమోదయ్యాయి.
కడప డీఎస్పీ సునీల్ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రొద్దుటూరుకు చెందిన చెన్నుపల్లి ప్రసన్నకుమార్ ఇంజినీరింగ్ మొదటి సంవత్సరంలో చదువు మానేసి జల్సాలకు అలవాటు పడ్డాడు. 2017లో ఇళ్లలో పలు దొంగతనాలకు పాల్పడ్డాడు. అనంతరం జైలుకు వెళ్లి బెయిలుపై బయటికి వచ్చాడు. ఆ తర్వాత ప్రసన్నకుమార్ కు షేర్‌చాట్ లో శ్రీనివాస్ అనే వ్యక్తితో 2020లో పరిచయమయ్యాడు.
మారుపేరుతో పరిచయమై.. హైదరాబాద్ సచివాలయంలో పనిచేస్తున్నానని, అటెండర్ ఉద్యోగం ఇప్పిస్తానని శ్రీనివాస్‌కు ఆశ చూపాడు ప్రసన్నకుమార్. అనంతరం తన తల్లి వైద్యం కోసమని డబ్బులు అడిగాడు. నమ్మిన శ్రీనివాస్ తన తల్లి మెడలోని బంగారు గొలుసు తీసుకెళ్లి ఇచ్చాడు. తర్వాత శ్రీనివాస్ ఎన్నిసార్లు ఫోన్‌చేసినా స్పందించలేదు. జులై 29న ఓ చోరీ కేసులో ప్రసన్నకుమార్‌ను అరెస్టు చేసి విచారించగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.
ఫేస్‌బుక్, షేర్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్ లలో అకౌంట్లు క్రియేట్ చేసి కడప, విజయవాడ, హైదరాబాద్ నగరాల్లోని యువతులు, మధ్య వయసు మహిళలతో పరిచయం పెంచుకుని.. వారికి మాయమాటలు చెప్పి ప్రేమలోకి దించేవాడు. వారితో చాటింగ్ చేస్తూ వారి నగ్న, అర్ధనగ్న చిత్రాలను, వీడియోలను సేవ్ చేసుకుని.. బ్లాక్‌మెయిల్ చేసి డబ్బులు పంపాలని డిమాండ్ చేసేవాడు. లేదంటే సోషల్ మీడియాలో షేర్ చేస్తానని బెదిరించేవాడని.. సుమారు 200మంది యువతులు, 100 మంది మహిళలను ఈ మాయగాడి చేతిలో మోసపోయారని డీఎస్పీ తెలిపారు.