మైనర్ బాలికకు 'ఐ లవ్ యూ' చెప్పిన యువకుడు.. రెండేళ్ల జైలు శిక్ష
ముంబైకి చెందిన ఓ యువకుడు మైనర్ బాలిక చేయి పట్టుకుని 'ఐ లవ్ యూ' చెప్పడంతో అతడిపై కేసు నమోదైంది
By Medi Samrat Published on 2 Aug 2024 4:30 PM ISTముంబైకి చెందిన ఓ యువకుడు మైనర్ బాలిక చేయి పట్టుకుని 'ఐ లవ్ యూ' చెప్పడంతో అతడిపై కేసు నమోదైంది. అంతేకాదు అలా చేసిన 19 ఏళ్ల యువకుడికి పోక్సో ప్రత్యేక కోర్టు రెండేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. బాలల లైంగిక నేరాల నుంచి ప్రత్యేక రక్షణ చట్టం (పోక్సో) కోర్టు న్యాయమూర్తి అశ్విని లోఖండే శిక్షను ప్రకటిస్తూ.. నిందితుడు మాట్లాడిన మాటలు.. 14 ఏళ్ల బాధితురాలి గౌరవాన్ని దెబ్బతీశాయని అన్నారు. జులై 30న జారీ చేసిన ఉత్తర్వుల్లో.. ఐపీసీ సెక్షన్ల కింద వేధింపులకు పాల్పడిన నిందితుడిని కోర్టు దోషిగా నిర్ధారించింది.
మైనర్ బాలిక తల్లి సెప్టెంబర్ 2019 లో సకినాకా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తన కూతురు టీ పొడి కొన డానికి సమీపంలోని దుకాణానికి వెళ్లిందని.. ఆ తర్వాత ఏడుస్తూ ఇంటికి తిరిగి వచ్చిందని ఫిర్యాదుదారు పోలీసులకు తెలిపారు. ఓ వ్యక్తి తనను వెంబడించి.. చేయి పట్టుకుని 'ఐ లవ్ యూ' అని చెప్పాడని బాలిక తన తల్లికి చెప్పిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే.. ఆ యువకుడు తనపై మోపిన ఆరోపణలపై.. తీను నిర్దోషినని పేర్కొన్నాడు. విచారణ సందర్భంగా.. నిందితుడి నేరాన్ని నిరూపించడానికి ప్రాసిక్యూషన్ బాధితురాలు, ఆమె తల్లితో సహా నలుగురు సాక్షులను విచారించింది.
నిందితుడు తాను నిర్దోషినని వేడుకున్నాడు. బాధితురాలితో తనకు సంబంధం ఉందని.. సంఘటన జరిగిన రోజు తనను కలవడానికి తానే ఆమెను పిలిచానని పేర్కొంటూ.. తనను తాను సమర్థించుకున్నాడు. అయితే బాధితురాలికి నిందితుడితో సంబంధాలు ఉంటే భయంతో ఈ విషయాన్ని తన తల్లికి ఎందుకు చెప్పిందని కోర్టు ప్రశ్నించింది. అంతేకాదు.. ఘటన అనంతరం బాలిక తల్లి నిందితుడి వద్దకు వెళ్లగా.. అతడు ఆమెను బెదిరించి.. ‘నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో’ అని దురుసుగా మాట్లాడినట్లు తేలింది.