చనిపోయాడని అంత్య‌క్రియ‌లు చేసిన కుటుంబ స‌భ్యులు.. తీరా చూస్తే..

Man found alive after family buries 'body' in Palghar. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో 60 ఏళ్ల ఆటో రిక్షా డ్రైవర్ చనిపోయాడని అతని కుటుంబ సభ్యులు భావించారు.

By M.S.R  Published on  7 Feb 2023 2:45 PM GMT
చనిపోయాడని అంత్య‌క్రియ‌లు చేసిన కుటుంబ స‌భ్యులు.. తీరా చూస్తే..

మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో 60 ఏళ్ల ఆటో రిక్షా డ్రైవర్ చనిపోయాడని అతని కుటుంబ సభ్యులు భావించారు. ఓ శవాన్ని పాతిపెట్టేశారు కూడా.! తీరా చూస్తే అతడు సజీవంగా కనిపించాడని పోలీసులు సోమవారం తెలిపారు. ఆ కుటుంబ సభ్యులు పూడ్చిపెట్టిన వ్యక్తిని గుర్తించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని పోలీసు అధికారి తెలిపారు.

జనవరి 29న బోయిసర్- పాల్ఘర్ స్టేషన్ల మధ్య ట్రాక్ దాటుతుండగా రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. పాల్ఘర్‌లోని ప్రభుత్వ రైల్వే పోలీసులు (GRP) మృతుడి చిత్రాలను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. పాల్ఘర్‌కు చెందిన ఒక వ్యక్తి GRPని సంప్రదించి, మరణించిన వ్యక్తి తన సోదరుడు రఫీక్ షేక్ అని పేర్కొన్నాడు. అతను రెండు నెలల క్రితం తప్పిపోయాడు, కుటుంబం కూడా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు GRP ఇన్స్పెక్టర్ నరేష్ రణధీర్ తెలిపారు.

పాల్ఘర్ GRP అధికారులు కేరళలో ఉన్న చనిపోయిన వ్యక్తి భార్యను సంప్రదించింది. ఆమె పాల్ఘర్‌కు వచ్చి మృతదేహాన్ని గుర్తించింది. చనిపోయింది తన భర్తనే అని ఆమె చెప్పడంతో అధికారులు శవాన్ని కుటుంబసభ్యులకు అప్పగించినట్లు అధికారి తెలిపారు. రెండు రోజుల క్రితమే మృతదేహాన్ని కుటుంబ సభ్యులు పూడ్చిపెట్టారని తెలిపారు.

ఆదివారం షేక్ స్నేహితుడు ఒకరు షేక్‌కు కాల్ చేశాడు. వీడియో కాల్ లో కనిపించాడు. దీంతో షేక్ బతికే ఉన్నాడని.. వేరే వ్యక్తికి సంబంధించిన శవాన్ని ఖననం చేశారని తెలిసింది. వీరిద్దరూ వీడియో చాట్ చేశారని, షేక్ క్షేమంగా ఉన్నారని తన స్నేహితుడికి తెలియజేసినట్లు పోలీసు అధికారి తెలిపారు. ఈ చాట్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్‌గా మారింది. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

పోలీసు అధికారి తెలిపిన వివరాల ప్రకారం, షేక్ కొన్ని నెలల క్రితం తన ఇంటిని విడిచిపెట్టి పాల్ఘర్‌లోని సఫలాలో ఉన్న అనాధ శరణాలయంలో దిగాడు. కుటుంబ సభ్యులు చనిపోయిన వ్యక్తి షేక్ అని భావించారు. ఇప్పుడు, పాతిపెట్టిన గుర్తుతెలియని వ్యక్తికి సంబంధించిన సమాచారాన్ని పోలీసులు కనుగొనే పనిలో ఉన్నారు.


Next Story