ఘజియాబాద్‌లో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అతనితో గొడవపడి ఢిల్లీలో ఉంటున్న అతని భార్య భర్త మరణ వార్త విని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ దంపతులకు ఏడాది వయసున్న బాలిక ఉంది. ఘజియాబాద్‌లో నివసించే విజయ్ ప్రతాప్ చౌహాన్ (32), అతని భార్య శివాని (28) ప్రాణాలు వదిలారు. భార్యాభర్తల మధ్య గత కొద్దినెలలుగా విభేదాలున్నాయి.
జవహర్ నగర్ జి బ్లాక్‌లో నివసిస్తున్న విజయ్, శివాని మధ్య శుక్రవారం సాయంత్రం తీవ్ర వాగ్వాదం జరిగింది. వివాదం నేపథ్యంలో శివాని తల్లిదండ్రుల ఇంటికి వెళ్లింది. ఆమె పుట్టింటికి వెళ్లిన తర్వాత విజయ్ శివానీకి కాల్ చేసాడు. అతడి కాల్స్ కు ఆమె స్పందించలేదు. దీంతో విజయ్ ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వెంటనే జరిగిన విషయాన్ని శివానికి తెలియజేశారు. ఈ వార్త వినగానే, శివాని తమ నివాసానికి దాదాపు 8 కిలోమీటర్ల దూరంలో ఓ విద్యుత్ స్తంభానికి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
ఈ ఘటనపై ఘజియాబాద్ పోలీసులు, ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. రెండు ఘటనా స్థలాల్లోనూ సూసైడ్ నోట్‌లు లభించలేదు. ఫోరెన్సిక్ బృందం రెండు ప్రదేశాలను పరిశీలించింది. శివాని శరీరంపై ఉరి వేసుకున్న గుర్తులు మినహా ఎలాంటి గాయాలు లేవని పోలీసులు నిర్ధారించారు.