నిత్య పెళ్లికొడుకు.. నకిలీ విడాకుల పత్రంతో ఏడు పెళ్లిళ్లు.. మూడు వీధుల్లో ముగ్గురు భార్య‌లు

Man Cheated seven women in the name of marriage.విడాకులు తీసుకుని రెండో పెళ్లి కోసం ఎదురు చూసే సంప‌న్న మ‌హిళ‌లే అత‌డి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 July 2022 4:20 AM GMT
నిత్య పెళ్లికొడుకు.. నకిలీ విడాకుల పత్రంతో ఏడు పెళ్లిళ్లు.. మూడు వీధుల్లో ముగ్గురు భార్య‌లు

విడాకులు తీసుకుని రెండో పెళ్లి కోసం ఎదురు చూసే సంప‌న్న మ‌హిళ‌లే అత‌డి ల‌క్ష్యం. వారికి ఓ కొత్త జీవితం క‌ల్పిస్తాన‌ని మాయ‌మాట‌లు చెబుతూ ఒక‌రు కాదు ఇద్ద‌రు కాదు ఏకంగా ఏడుగురిని పెళ్లి చేసుకున్నాడు. వివాహానంత‌రం వారి వ‌ద్ద నుంచి ల‌క్ష‌ల్లో న‌గ‌దును దోచుకున్నాడు. ఒకే కాల‌నీలో మూడు వీధుల్లో ముగ్గురు ఉండ‌డం గ‌మ‌నార్హం. ఇత‌డిపై ఇప్ప‌టికే ప‌లు స్టేష‌న్ల‌లో కేసులు న‌మోదు అయ్యాయి. ఇత‌డి బారిన ప‌డి మోస‌పోయిన ఇద్ద‌రు మ‌హిళ‌లు నిన్న సోమాజీగూడ ప్రెస్‌క్ల‌బ్‌లో మ‌రెవ‌రూ త‌మ‌లాగా ఇత‌గాడి బారిన ప‌డి మోస‌పోకూడ‌ద‌ని వివ‌రాల‌ను వెల్ల‌డించారు.

బాధితులు వెల్ల‌డించిన వివ‌రాల మేర‌కు.. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం బేతపూడికి చెందిన అడపా శివశంకర్ బాబు రెండో వివాహం కోసం మ్యాట్రిమోని సైట్లలో నమోదు చేసుకున్నాడు. తనకు వివాహమై విడాకులు తీసుకున్నానని, ఒక కుమార్తె కూడా ఉందని చెప్పేవాడు. తనను సంప్రదించిన వారికి న‌కిలీ విడాకుల ధ్రువీకరణ పత్రాన్ని చూపించి న‌మ్మించేవాడు. తాను ఓ ఐటీ కంపెనీలో ప‌ని చేస్తున్నాన‌ని నెల‌కు రూ.2ల‌క్ష‌ల్లో వేత‌నం అని ప్లే స్లిప్ ల‌ను కూడా చూపించేవాడు.

వివాహాం అనంత‌రం అమెరికాకు వెలుతున్న‌ట్లుగా న‌టించి ల‌క్ష‌ల్లో డ‌బ్బులు గుంజేవాడు. కొద్ది రోజుల‌కు ప్ర‌యాణం వాయిదా ప‌డింద‌ని చెప్పేవాడు. ఒక‌వేళ వారు గ‌ట్టిగా అడిగితే పోలీసుల‌కు ఫిర్యాదు చేసుకోమ‌ని చెప్పేవాడు. బాధిత మహిళ ఒకరు మెదక్ జిల్లా రామచంద్రాపురం పోలీస్ స్టేషన్‌‌ను ఆశ్రయించింది. దీంతో పోలీసులు అతడిని పిలిపించడంతో మరో మహిళతో వచ్చాడు. ఆమే తన భార్య అని చెప్పాడు. భార్యకు విడాకులు ఇచ్చానన్న నిందితుడు మరో మహిళతో పోలీస్ స్టేషన్‌కు రావడంతో వారిలో అనుమానం మొదలైంది. ఆ తర్వాత మహిళలు ఇద్దరూ మాట్లాడుకోవడంతో వారిద్దరూ ఒకేలా అతడి చేతిలో మోసపోయినట్టు తెలుసుకున్నారు. దీంతో రెండో మహిళ తన సోదరులకు చెప్పి అతడిపై నిఘా పెట్టగా ఒకే కాలనీలోని మూడు వీధుల్లో ముగ్గురు మహిళలతో అతడు జీవిస్తున్న విషయం బయటపడింది. నిలదీయడంతో ఆ తర్వాత కనిపించడం మానేశాడు.

మ‌రిన్ని వివ‌రాలు ఆరా తీయ‌గా మొత్తంగా త‌మ‌తో క‌లిసి ఏడుగురు అత‌డి చేతిలో మోస‌పోయిన‌ట్లు తెలుసుకున్నారు. అత‌డిపై 2019లో కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్‌లో ఒకరు, 2021లో మరొకరు, అలాగే ఆర్సీపురం, గచ్చిబౌలి, అనంతపురం, ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషనల్లో వేర్వేరు మహిళలు అతడిపై ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. చివ‌ర‌గా గ‌త ఏప్రిల్‌లో మరో అమ్మాయిని పెళ్లాడాడని, అప్పటి నుంచి పరారీలో ఉన్నాడని తెలిపారు.

Next Story