యువతిపై బీర్ సీసాతో దాడి చేసిన యువకుడు
man attacked young woman with beer bottle. నిజామాబాద్ జిల్లాలోని మోపాల్ మండలం కేంద్రంలో తనను ప్రేమించడం
By Medi Samrat
నిజామాబాద్ జిల్లాలోని మోపాల్ మండలం కేంద్రంలో తనను ప్రేమించడం లేదని ఓ యువతిపై బీర్ సీసాతో యువకుడు దాడి చేశాడు. దీంతో ఆమె గొంతుకు తీవ్ర గాయమైంది. బాధితురాలిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం బాధితురాలి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. సంజయ్ అనే యువకుడికి రెండేండ్ల క్రితం ప్రియాంక అనే యువతి పరిచయమైంది. సంజయ్‌కు ఆమె దూరపు బంధువు. అప్పటి నుండి తనను ప్రేమించాలని సంజయ్ ఆమె వెంట పడుతున్నాడు. ప్రియాంక అతని ప్రేమను తిరస్కరిస్తూ వస్తోంది. దీంతో శనివారం ఉదయం ఒంటరిగా ఉన్న ప్రియాంకపై బీరు సీసాతో దాడి చేశాడు. ఆ సీసాతో గొంతుపై దాడి చేసి గాయపరిచాడు. తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించి, వైద్యం అందించారు. కేసు నమోదు చేసుకున్న మోపాల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తనను ప్రేమించడం లేదని యువతులపై ఆసిడ్ దాడి చేయడాలు, హత్యలు చేయడం వంటి ఘటనలు ఎక్కువైపోతున్నాయి. ఇలా ప్రేమ పేరుతో ఎంతో మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఎంతో మంది జీవితాలు జైలుపాలు అవుతున్నాయి. అయినప్పటికీ ఇలాంటి ఘటనలు మాత్రం ఎక్కడా ఆగటం లేదు. ఈ ఘటనకు పాల్పడిన సంజయ్ ను కఠినంగా శిక్షించాలని ప్రియాంక కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.