పెళ్లి చేసుకుంటానని 26 మంది మహిళలను మోసం చేసిన ఓ వ్యక్తిని కర్ణాటకలోని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితులను వలలో వేసుకోడానికి నిందితుడు మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌లను ఉపయోగించాడు. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న మహిళను మోసం చేయడానికి ప్రయత్నించి అతడు పోలీసులకు దొరికిపోయాడు. ప్రస్తుతం అతడు జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. విజయపూర్‌కు చెందిన జై భీమ్ విట్టల్ పడుకోటి (33)ని నిందితుడిగా గుర్తించారు. అతడి బ్యాంకు ఖాతాలను సస్పెండ్ చేయడంతో పాటు అతని వద్ద నుంచి ఓ లగ్జరీ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తండ్రి చనిపోవడంతో నిందితుడు లైన్‌మెన్‌గా ఉద్యోగం సంపాదించాడు. 2013లో కవిత అనే మహిళను పెళ్లి చేసుకుని గొడవపడి హత్య చేశాడని ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు గాను అతనికి రెండేళ్ల జైలు శిక్ష పడింది. బెయిల్ పొందిన తర్వాత విలాసవంతమైన జీవితం గడపడానికి మహిళలను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు. నిందితుడు సెక్షన్ ఆఫీసర్‌గా నటించి పెళ్లి సైట్లలో మోసపూరిత ఖాతాలు సృష్టించాడు. మహిళల ప్రొఫైల్ నచ్చిందని మెసేజ్ లు పంపేవాడు. అనంతరం బాధితుల తల్లిదండ్రులు, బంధువుల విశ్వాసాన్ని పొందేందుకు వారి ఇళ్లకు వెళ్లేవాడు. లక్షలాది రూపాయలకు బదులుగా బాలికల బంధువులకు ప్రభుత్వ పదవులు ఇప్పిస్తానని హామీ ఇచ్చాడు. అలా ఇప్పటి దాకా 26 మంది మహిళలను మోసం చేశాడు. లక్షల్లో డబ్బులు లాగేసినట్లు తెలుస్తోంది.