మొబైల్ దొంగిలించాడ‌నే అనుమానంతో వ్య‌క్తిని కొట్టి చంపారు.. 14 మంది అరెస్టు

కోల్‌కతాలో శుక్రవారం నాడు మొబైల్ ఫోన్ దొంగిలించారనే అనుమానంతో 37 ఏళ్ల టీవీ మెకానిక్‌ను హాస్టల్ విద్యార్థుల బృందం కొట్టి చంపింది.

By Medi Samrat  Published on  29 Jun 2024 8:26 PM IST
మొబైల్ దొంగిలించాడ‌నే అనుమానంతో వ్య‌క్తిని కొట్టి చంపారు.. 14 మంది అరెస్టు

కోల్‌కతాలో శుక్రవారం నాడు మొబైల్ ఫోన్ దొంగిలించారనే అనుమానంతో 37 ఏళ్ల టీవీ మెకానిక్‌ను హాస్టల్ విద్యార్థుల బృందం కొట్టి చంపింది. ఈ ఘటనకు సంబంధించి 14 మందిని అరెస్టు చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. బాధితుడు ఇర్షాద్ నగరంలోని చాందినీ చౌక్ ప్రాంతంలో టీవీ రిపేర్ షాపులో పనిచేసేవాడని సంబంధిత వర్గాలు తెలిపాయి. పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

పోలీసు వర్గాల కథనం ప్రకారం, బౌబజార్ ప్రాంతంలోని ఉదయన్ హాస్టల్‌లో ఉంటున్న విద్యార్థికి చెందిన మొబైల్ ఫోన్ దొంగిలించారు. దీనికి సంబంధించి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. హాస్టల్‌లో వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు, పూర్వ విద్యార్థులు ఉన్నారు. శుక్రవారం ఇర్షాద్‌ హాస్టల్‌ పరిసరాల్లో సంచరిస్తూ ఉండడంతో అతనే దొంగ అయి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు. దీంతో విద్యార్థులు ఇర్షాద్‌ను పట్టుకుని ఓ గదిలో బంధించి దారుణంగా దాడి చేశారు. ఈ విషయం తెలుసుకున్న వ్యక్తులు సమీపంలోని పోలీస్ స్టేషన్‌ కి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు బృందం ఇర్షాద్‌ను రక్షించి ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ అతను మరణించాడు. పలు సెక్షన్స్ కింద కేసును నమోదు చేసి.. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

Next Story