తల్లిపై అత్యాచారానికి పాల్పడ్డ తనయుడిని కటకటాల్లోకి నెట్టింది కోర్టు. అతడు చేసిన పాడు పనికి జీవిత కారగార శిక్ష విధించింది. మహారాష్ట్రలోని గోండియా జిల్లా సెషన్స్ కోర్టు గతేడాది ఆగస్టులో మద్యం మత్తులో తన తల్లిపై అత్యాచారం చేసిన వ్యక్తికి జీవిత ఖైదు విధించింది. శిక్ష విధిస్తున్నప్పుడు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్, సెషన్స్ జడ్జి షబ్బీర్ అహ్మద్ ఔటి.. ఆ వ్యక్తిని అతని సహజ జీవితాంతం జైలులో ఉంచాలని ఆదేశించారు. నిందితుడికి రూ. 2,000 జరిమానా విధింపుతో పాటు బాధితురాలికి రూ. 2 లక్షల నష్టపరిహారాన్ని అందించాలని కోర్టు ఆదేశిస్తూ కోర్టు తీర్పు చెప్పింది.
కేసును త్వరితగతిన విచారించిన కోర్టు నిందితుడికి జీవిత ఖైదు శిక్ష విధించింది. జనవరి 19న నిందితుడిపై సాక్ష్యాలను కోర్టు పరిశీలించిందని, జనవరి 24న అతని వాంగ్మూలాన్ని నమోదు చేసిందని, జనవరి 31న తుది విచారణ అనంతరం తీర్పు వెలువడిందని కేసును విచారించిన రావన్‌వాడి పోలీసు అధికారి తెలిపారు. మద్యం మత్తులో నిందితుడు.. తల్లి అని చూడకుండా దారుణానికి తెగబడ్డాడు. కామంతో కళ్లు మూసుకుపోయి.. తల్లిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. (లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులపై సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం బాధితురాలి గుర్తింపు ఆమె గోప్యతను కాపాడేందుకు బహిర్గతం చేయబడలేదు).