మదనపల్లి జంట హత్యల్లో సంచలన విషయాలు.. చిన్న కుమార్తె దెయ్యాలను చూసిందట
Madanapalle Double Murder Case. మూఢభక్తితో దారుణంగా ఇద్దరు కూతుళ్లను హత్య చేసిన ఘటనల్లో సంచలన విషయాలు..
By Medi Samrat Published on 26 Jan 2021 1:58 PM IST
మూఢభక్తితో దారుణంగా ఇద్దరు కూతుళ్లను హత్య చేసిన ఘటన తెలుగు రాష్ట్రాల ప్రజలను షాక్ కు గురిచేసింది. శివనగర్‌కు చెందిన పురుషోత్తం నాయుడు మదనపల్లె ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో వైస్ ప్రిన్సిపల్. ఆయన భార్య పద్మజ ఓ విద్యాసంస్థలో కరస్పాండెంట్‌గా, ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్నారు. పురుషోత్తం, పద్మజ దంపతులకు అలేఖ్య (27), సాయిదివ్య (22) కుమార్తెలు. అలేఖ్య భోపాల్‌లో పీజీ చదువుతోంది. సాయిదివ్య బీబీఏ పూర్తిచేసి ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అకాడమీలో సంగీతం నేర్చుకుంటోంది.
ఉన్నత విద్యావంతులై కళాశాల ప్రిన్సిపాళ్లగా పనిచేస్తున్న భార్యాభర్తలు, వారి కుమార్తెలకు భక్తి కూడా అపారం. అన్ని విషయాలకు బాబా దయే కారణమని చెప్పుకునేవారు. ఇక వారం రోజుల క్రితం పెద్దమ్మాయి అలేఖ్య (27), సాయిదివ్య కలిసి పెంపుడు కుక్కను వాకింగ్‌కు తీసుకెళ్లారు. రోడ్డుపై ముగ్గువేసి అందులో ఉంచిన నిమ్మకాయలను పొరపాటున తొక్కేశారు. ఇంటికొచ్చాక ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో భయపడిపోయారు. కొద్ది రోజుల తర్వాత ఇంట్లో దెయ్యాలు ఉన్నాయని చిన్నకుమార్తె చెప్పింది. చివరికి టాయిలెట్‌కు వెళ్లాలన్నా ఇద్దరూ కలిసి వెళ్లేవారు. ఆ తర్వాత తమిళనాడుకు చెందిన ఓ మంత్రగాడిని కలిసి తాయెత్తు కట్టించుకున్నారు. గత వారం రోజులుగా పద్మజ, పురుషోత్తం ఇద్దరూ ఇంట్లోనే ఉంటున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో పూజలు చేస్తుండగా, పై అంతస్తులో ఉన్న సాయిదివ్య మ్యూజిక్ వాయిస్తూ ఒక్కసారిగా కేకలు వేసింది. దీంతో పరుగున వెళ్లిన మిగతా ముగ్గురు ఆమెకు దెయ్యం ఆవహించిందని భావించారు. దానిని వదిలించేందుకు ఆమె తలపై డంబెల్‌తో గట్టిగా కొట్టారు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అలేఖ్య చెల్లెలి నుదుటిపై ముగ్గులు వేసి ఆత్మ బయటకు వెళ్లకుండా బందించానని చెప్పింది. ఆమెను బతికించేందుకు తనను కూడా చంపాలని తల్లిని కోరింది. దీంతో ముగ్గురూ కలిసి నగ్నంగా పూజలు చేశారు. పూజల అనంతరం అలేఖ్యను పూజగదిలోకి తీసుకెళ్లిన తల్లి నోటిలో రాగి కలశాన్ని పెట్టి, అందులో నవధాన్యాలు పోసింది. ఆపై డంబెల్‌తో ఆమెను కూడా కొట్టి చంపారు. సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఏడు గంటలకు విషయాన్ని పురుషోత్తం తన సహచర అధ్యాపకుడికి ఫోన్ చేసి చెప్పాడు. ఆయన పరుగున వచ్చి అక్కడి దృశ్యాన్ని చూసి విస్తుపోయాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. వారొచ్చి మృతదేహాలను తరలించే ప్రయత్నం చేయగా పద్మజ అడ్డుకుంది. కుమార్తెలు ఇద్దరు పుణ్యలోకాల్లో ఉన్నారని, తానే పార్వతిని అని చెప్పుకొచ్చింది. రేపు ఉదయాన్నే వారిని బయటకు తీసుకొస్తానంటూ గట్టిగా అరిచింది. చివరికి అర్ధరాత్రి తర్వాత మృతదేహాలను మార్చురీకి తరలించారు. అంత చదువుకున్న వారు ఇలా మూఢనమ్మకాలతో జీవితాలను నాశనం చేసుకున్నారా అని చుట్టుపక్కల వారు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు.