సూర్యాపేట జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పెద్దలు పెళ్లికి అంగీకరించలేదని చెట్టుకు ఉరి వేసుకుని ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మునగాల మండలం మొద్దుల చెరువు గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చివ్వెంల మండలం చందుపట్ల గ్రామానికి చెందిన నవీన్(21).. అదే గ్రామానికి చెందిన ఓ యువతి కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు.
పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తమ ప్రేమ విషయాన్ని ఇరు కుటుంబాల్లోని పెద్దలకు చెప్పారు. అయితే.. వీరి ప్రేమను పెద్దలు ఒప్పుకోలేదు. దీంతో ప్రేమజంట మనస్థాపానికి గురైంది. గురువారం సాయంత్రం ఇంట్లో నుంచి బయటకు వచ్చేశారు. అక్కడి నుంచి మొద్దుల చెరువు గ్రామంలోని శివారు ప్రాంతానికి చేరుకొని చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. శుక్రవారం ఉదయం అటుగా వెలుతున్న స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.