అర్థరాత్రి సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం
Lorry Collides with Tractor in Munagala Five dead.మునగాల మండలం కేంద్రం శివారులో అర్థరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది
By తోట వంశీ కుమార్ Published on 13 Nov 2022 2:23 AM GMTసూర్యాపేట జిల్లా మునగాల మండలం కేంద్రం శివారులో అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్‌ను లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందారు. మరో 10 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఓ పురుషుడు, ఓ బాలుడు ఉన్నాడు.
వివరాలు ఇలా ఉన్నాయి. మునగాల మండల కేంద్రానికి చెందిన కొందరు సాగర్ ఎడమకాలువ గట్టుపై ఉన్న అయ్యప్ప ఆలయంలో మహాపడిపూజ కార్యక్రమానికి హాజరయ్యారు. పూజ పూర్తి అయిన అనంతరం అర్థరాత్రి 12 గంటల సమయంలో ట్రాక్టర్‌లో గ్రామానికి తిరుగుప్రయాణం అయ్యారు.
ఆలయం వద్ద యూటర్న్ లేదు. కిలోమీటరున్నర దూరంలో యూ టర్న్ ఉంది. దూరం తగ్గించుకునేందుకు డ్రైవర్ విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై ట్రాక్టర్‌ను రాంగ్‌లో తీసుకువెళ్లాడు. అదే సమయంలో హైదరాబాద్ నుంచి విజయవాడకు వెలుతున్న లారీ.. ట్రాక్టర్ ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మరణించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అధికారులు ఘటనాస్థలానికి చేరుకున్నారు.
10 మందికి పైగా తీవ్రంగా గాయపడగా.. మరో 15 మందికి స్వల్ప గాయాలు అయ్యాయి. తీవ్రగాయాలైనవారిని ఖమ్మం, సూర్యాపేటలోని ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించగా.. స్వల్పంగా గాయపడిన వారిని కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరు కన్నుమూశారు. దీంతో ఈ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య ఐదుకు చేరింది. పలువురి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రమాద సమయంలో ట్రాక్టర్‌లో 38 మంది వరకు ఉన్నట్లు తెలుస్తోంది.
మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతులను చింతకాయల ప్రమీల(33), తన్నీరు ప్రమీల(35), ఉదయ్ లోకేశ్(8), గుండు జ్యోతి(38), నారగాని కోటయ్య(55)గా గుర్తించారు.