వృద్ధురాలిని చంపి తినేసిన చిరుతపులి
రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ జిల్లాలో చిరుతపులి జనాలపై విరుచుకుపడి తింటుంది.
By Medi Samrat Published on 30 Sept 2024 11:39 AM ISTరాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ జిల్లాలో చిరుతపులి జనాలపై విరుచుకుపడి తింటుంది. సెప్టెంబర్ నెలలోనే ఆ చిరుతపులి ఆరుగురిని బలితీసుకుంది. వరుస ఘటనలతో జిల్లా వ్యాప్తంగా భయానక వాతావరణం నెలకొంది. మరోవైపు ఇప్పటి వరకు మూడు చిరుతలను పట్టుకోవడంలో అటవీశాఖ విజయం సాధించింది. అయితే ఈ ప్రాంతంలో ఇప్పటికీ చిరుతపులి ఉన్నట్లుగా ఘటనలను బట్టి తెలుస్తోంది.
తాజాగా శనివారం చిరుతపులి దాడి ఘటన వెలుగులోకి వచ్చింది. ఉదయ్‌పూర్‌లోని గోగుండా ప్రాంతంలో చిరుతపులి వృద్ధురాలిని చంపింది. అడవిలో మహిళ మృతదేహం లభ్యమైంది. మృతదేహం ఛిద్రమైన స్థితిలో కనిపించింది. ఇంతకు ముందు కూడా ఐదుగురు చిరుతపులి బారిన పడ్డారు. మృతి చెందిన మహిళను గాహుబాయిగా గుర్తించారు. ఆమె గుర్జర్ల గూడ నివాసి. గ్రామస్థుల సాయంతో భర్త వెతకగా అడవిలో వృద్ధురాలి మృతదేహం లభ్యమైంది.
ఉదయ్‌పూర్‌లో మూడు చిరుతపులిలను పట్టుకోవడంలో అటవీ శాఖ, ఆర్మీ బృందం గతంలో విజయం సాధించింది. ఉదయ్‌పూర్‌లో ఐదురోజుల్లోనే చిరుతపులులు ముగ్గురిని బలిగొన్నాయి. ఆర్మీ, అటవీ శాఖ బృందం అడవిలో పెద్ద పంజరాన్ని ఏర్పాటు చేసింది. అందులో మాంసాన్ని ఉంచింది. దాని తినడానికి వచ్చిన చిరుతపులిని పట్టుకున్నారు. దీంతో పాటు డ్రోన్‌ల సాయంతో కూడా చిరుతలను వెతికారు.