కోర్టు కాంప్లెక్స్‌లో న్యాయవాది దారుణ హత్య

Lawyer Killed Inside Court Complex In Uttar Pradesh's Shahjahanpur. ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లోని జిల్లా కోర్టు కాంప్లెక్స్‌లో న్యాయవాది హత్యకు గురయ్యాడు.

By Medi Samrat  Published on  18 Oct 2021 11:19 AM GMT
కోర్టు కాంప్లెక్స్‌లో న్యాయవాది దారుణ హత్య

ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లోని జిల్లా కోర్టు కాంప్లెక్స్‌లో న్యాయవాది హత్యకు గురయ్యాడు. చ‌నిపోయిన న్యాయ‌వాదిని భూపేంద్ర సింగ్‌గా గుర్తించారు. ఆయన జలాల్‌బాద్‌కు చెందిన వారని తెలుస్తోంది. కోర్టు కాంప్లెక్స్ మూడో అంతస్తులో విగ‌త జీవిగా ప‌డివున్న భూపేంద్ర సింగ్ ను దేశ‌వాళి పిస్ట‌ల్‌తో కాల్చిచంపిన‌ట్లు తెలుస్తోంది. న్యాయవాది భూపేంద్ర సింగ్ కాంప్లెక్స్‌లో మాట్లాడుతుండ‌గా.. అకస్మాత్తుగా పెద్ద శబ్దం వచ్చి.. అతను నేల మీద పడిపోయి ఉన్నాడ‌ని చెబుతున్నారు.

చ‌నిపోయిన న్యాయ‌వాది అంత‌కుముందు బ్యాంకులో ఉద్యోగం చేసాడు. గత 4-5 సంవత్సరాలుగా న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నాడని కోర్టులోని ఒక న్యాయవాది తెలిపాడు. తాము కోర్టులో ఉన్నామని.. ఎవరో వచ్చి, ఒక వ్యక్తిని కాల్చి చంపారని చెప్పడంతో.. వ‌చ్చి చూసేస‌రికి మృతదేహం, ప‌క్క‌నే నాటు తుపాకీ కనిపించాయని ఆ న్యాయ‌వాది చెప్పాడు. పోలీసులు సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని ప‌రిశీలించారు. కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు తెలిపారు. ఈ ఘ‌ట‌న‌పై బిఎస్‌పి అధినేత్రి మాయావతి స్పందిచారు. కోర్టు ప్రాంగ‌ణంలో న్యాయ‌వాది హ‌త్య‌ చాలా విచారకరం.. ఇలా జ‌ర‌గ‌డం సిగ్గుచేటు.. అంటూ రాష్ట్రంలో శాంతిభద్రతలపై బీజేపీ ప్ర‌భుత్వంపై ఫైర్ అయ్యారు. ఈ మేర‌కు ఆమె ట్వీట్ చేశారు.


Next Story
Share it