దారుణం.. చేసిన పనికి డబ్బులు అడిగినందుకు..
Labourer's hand chopped off in MP after he asked for pending wages.అతడు ఓ దినసరి కూలీ. ఓ కాంట్రాక్టర్ దగ్గర భవన
By తోట వంశీ కుమార్ Published on 24 Nov 2021 2:23 PM ISTఅతడు ఓ దినసరి కూలీ. ఓ కాంట్రాక్టర్ దగ్గర భవన నిర్మాణ కార్మికుడిగా పనులు చేస్తున్నాడు. తాను చేసిన పనికి సంబంధించిన నగదును ఇవ్వమని చాలా రోజులుగా కాంట్రాక్టర్‌ను అడుగుతున్నాడు. ఇదిగో రేపు, మాపు అంటూ ఆ కాంట్రాక్టర్ చెప్పుతున్నాడే తప్ప డబ్బులు ఇవ్వడం లేదు. దీంతో ఓ రోజు అతడు .. కాంట్రాక్టర్‌ను నగదు విషయంలో గట్టిగా నిలదీశాడు. దీంతో ఇద్దరి మధ్యా వాగ్వాధం చోటు చేటుచేసుకుంది. ఈ క్రమంలో కాంట్రాక్టర్.. కూలీ చేతిని నరికివేశాడు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. రేవా జిల్లా సిర్‌మౌర్ గ్రామంలో అశోక్ సాకేత్(45) తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. సాకేత్ కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇటీవల అతను గణేశ్ మిశ్రా అనే కాంట్రాక్టర్ దగ్గర భవన నిర్మాణ కార్మికుడిగా పని చేశారు. ఆ పనులకు సంబంధించి కొంత నగదును ఇచ్చిన గణేశ్.. మిగతాది తరువాత ఇస్తానని చెప్పాడు. నగదు విషయమై సాకేత్ పలుమార్లు గణేశ్ వద్దకు వెళ్లగా.. రేపు, మాపు అంటూ కాలం గడుపుతున్నాడు. ఎన్ని రోజులైనప్పటికి నగదు ఇవ్వకపోవడంతో గత శనివారం గణేశ్ మిశ్రా వద్దకు వెళ్లిన సాకేత్ గట్టిగా నిలదీశాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది.
ఈ క్రమంలో సహనం కోల్పోయిన గణేశ్.. సాకేత్ చేతిని నరికేశాడు. చేయి తెగి కిందపడిపోయింది. దీంతో భయపడిన సాకేత్ వెంటనే అక్కడి నుంచి పరుగులు తీసుకుంటూ సిర్‌మౌర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. కేసు నమోదు చేసిన పోలీసులు సాకేత్‌ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిచారు. ఘటనాస్థలం నుంచి చేతిని తెచ్చినప్పటికి అప్పటికే ఆలస్యం కావడంతో చేతిని అతికించేందుకు వీలుపడలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గణేశ్ మిశ్రాతో పాటు ఘటన జరిగిన సమయంలో అక్కడే ఉన్న అతని సోదరులు రత్నేశ్ మిశ్రా, క్రిష్ణ మిశ్రాలను అదుపులోకి తీసుకున్నారు.