కర్నూలు జిల్లాలో చోటుచేసుకున్న ఘోర బస్సు ప్రమాదంలో మొత్తం 19 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. ప్రమాదంపై లోతైన దర్యాప్తు కోసం ప్రభుత్వం 16 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడంతో పాటు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది .
మృతుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఆరుగురు చొప్పున, కర్ణాటక, తమిళనాడు నుంచి ఇద్దరు చొప్పున, బీహార్, ఒడిశా నుంచి ఒక్కొక్కరు ఉన్నారని అధికారులు తెలిపారు. ఈ దారుణ ఘటనపై ఇప్పటికే కేసు నమోదు చేశామని, దర్యాప్తును ముమ్మరం చేశామని మంత్రి అనిత తెలిపారు.
బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు చెప్పారు. డ్రైవర్ ఇచ్చిన ప్రాథమిక సమాచారం ఆధారంగా కొన్ని కీలక అంశాలను పరిశీలిస్తున్నామన్నారు. ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలను నిగ్గు తేల్చేందుకు 16 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, అన్ని కోణాల్లో లోతైన దర్యాప్తు జరుగుతుందని ఆమె హామీ ఇచ్చారు.