బట్టతలను కవర్ చేస్తూ విగ్గు పెట్టుకుని చాలా మంది అమ్మాయిలను మోసం చేసిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిపై పోలీసులు పీడి యాక్ట్ కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. కార్తీక్ వర్మ అనే యువకుడు సోషల్ మీడియాలో అమ్మాయిలను ట్రాప్ చేసేవాడు. తానొక ఎన్‌ఆర్‌ఐని అని చెప్పుకుంటూ అమ్మాయిలను ముగ్గులోకి దింపే వాడు. పెళ్లి కాలేదంటూ కార్తీక్ వర్మ తన ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టేవాడు. అతడి ఫొటోలు చూసిన ఎంతో మంది అమ్మాయిలు అతని ట్రాప్‌లో పడ్డారు. అమ్మాయిలతో సన్నిహితంగా ఉంటూ వారి ఫొటోలను కార్తీక్ వర్మ సేకరించేవాడు. అమ్మాయిలతో పరిచయం పెంచుకుని కొన్నాళ్లు పాటు వారిని సహజీవనం పేరుతో లోబర్చుకునేవాడు.
ఒంటరి సమయంలో యువతుల వ్యక్తిగత ఫొటోలను తీసి కార్తీక్ వర్మ బెదిరింపులకు పాల్పడేవాడు. ఆ తర్వాత డబ్బులు ఇవ్వాలంటూ లేదంటే ఫొటోలను సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరింపులకు దిగేవాడు. ఇలా చాలా మంది అమ్మాయిల దగ్గరి నుండి డబ్బులు లాగాడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు 20 మంది అమ్మాయిలు కార్తీక్ వర్మ చేతిలో మోసం పోయారు. తాజాగా హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఓ అమ్మాయితో సన్నిహితంగా ఉన్నట్లు నటించి డబ్బులు గుంజాడు. దీంతో బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన నార్త్‌జోన్ పోలీసులు.. కార్తీక్ వర్మను అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. బట్టతలను కవర్ చేసి విగ్గు పెట్టుకుని కార్తీక్ వర్మ మోసాలకు పాల్పడ్డాడు.