కర్ణాటకలోని హసన్ జిల్లాలోని మహారాజా పార్క్ వద్ద బాలికతో అనుచితంగా ప్రవర్తించాడనే ఆరోపణతో రద్దీగా ఉండే ట్రాఫిక్ జంక్షన్‌లో ఓ వ్యక్తిని దారుణంగా కొట్టి, నగ్నంగా ఊరేగించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దాడికి గురైన వ్యక్తి రాష్ట్రంలోని విజయపుర జిల్లాకు చెందిన మేఘరాజ్‌గా గుర్తించారు. హసన్ నగరంలో అతడు భవన నిర్మాణ కార్మికుడిగా పని చేస్తున్నాడు. పార్క్‌లో సేదతీరుతుండగా బాలికను మేఘరాజ్ వేధిస్తున్నట్లు స్థానికులు గమనించారు. ఆ తర్వాత కొందరు వ్యక్తులు అతనిపై దాడి చేశారు. పోలీసులకు అప్పగించడానికి బదులు, వారు అతనిని కొట్టి, బట్టలు విప్పి, ఆపై రద్దీగా ఉండే ట్రాఫిక్ జంక్షన్ అయిన హేమావతి విగ్రహం సర్కిల్ దగ్గర నగ్నంగా ఊరేగించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షించారు.

వెంటనే మేఘరాజ్‌ని అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై ఆరా తీసిన హసన్‌ నగర పోలీసులు నలుగురు గుర్తు తెలియని వ్యక్తులపై దాడి చేసి నగ్నంగా ఊరేగించినందుకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. సంఘటనా స్థలంలో కొంతమంది వ్యక్తులు చేసిన ఆరోపణల ప్రకారం, ఆరోపించిన బాలిక మేఘరాజ్‌పై ఎటువంటి ఫిర్యాదు చేయలేదు. అయితే, అతన్ని దారుణంగా కొట్టి, బహిరంగంగా నగ్నంగా ఊరేగించినందున నలుగురిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు పోలీసులు. ఐపీసీ సెక్షన్‌లు 341 (తప్పుడు నిర్బంధానికి శిక్ష), 323 (స్వచ్ఛందంగా గాయపరిచినందుకు శిక్ష) 504 (శాంతిని ఉల్లంఘించేలా ఉద్దేశపూర్వకంగా అవమానించడం), 506 (నేరపూరిత బెదిరింపులకు శిక్ష) కింద నలుగురిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని" హసన్ పోలీసులు తెలిపారు.

అంజి

నేను గోనె అంజి. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో 99టీవీ, మోజో టీవీ, ఐ న్యూస్‌, ప్రైమ్‌ 9 న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

Next Story