హెయిర్ డ్రయర్ బ్లాస్ట్ ఘటనలో ఊహించని ట్విస్ట్ బయట పడింది. మొదట ఇదొక ప్రమాదమని భావించారు. కానీ ఇది పక్కా ప్లాన్ ప్రకారం చేసిన బ్లాస్ట్ అని తేలింది. అయితే బ్లాస్ట్ లో ఒకరికి బదులు మరొకరికి ఊహించని ప్రమాదం నెలకొంది. ప్రతీకారం తీర్చుకోవాలని చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది.
కర్ణాటకలో హెయిర్ డ్రైయర్ పేలుడు ఘటనలో హత్య చేయాలనే ఉద్దేశ్యంతో అందులో డిటోనేటర్‌ను అమర్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే అతడు అనుకున్న లక్ష్యం వేరు.. జరిగింది వేరు. ఈ పేలుడులో నిందితుడి ప్రియురాలు చేతులు కోల్పోవాల్సి వచ్చింది. నిందితుడిని కొప్పల్‌లోని కుర్తగేరి గ్రామానికి చెందిన సిద్దప్ప శీలవంత్ అలియాస్ హుడేడ్‌మణి (35)గా గుర్తించారు.
ఈ హెయిర్ డ్రైయర్‌ను నవంబర్ 15న శశికళ అనే మహిళకు కొరియర్ పంపారు. ఆమె అక్కడ లేకపోవడంతో శశికళ తన ఇరుగుపొరుగువారిలో ఒకరైన బసవరాజేశ్వరిని పార్శిల్ తీసుకుని దానిని తెరవమని కోరింది. అయితే బసవరాజేశ్వరి స్విచ్ ఆన్ చేయగానే అది ఆమె చేతుల్లోనే పేలింది. బసవరాజేశ్వరితో సంబంధాన్ని వ్యతిరేకించినందుకు శశికళను హత్య చేసేందుకు సిద్దప్ప పథకం పన్నాడని విచారణలో తేలింది. ఊహించని ఘటనలో అతడి ప్రేయసి చేతులు పోగొట్టుకుంది.