కర్ణాటక ప్రాంతంలోని ఉత్తర కన్నడలోని అరేబైల్‌లో ఘోర ప్రమాదం జరిగింది. బుధవారం ఉదయం లారీ అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో పది మంది మృతి చెందగా, మరో 15 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. బాధితులు కూరగాయలు విక్రయించేందుకు సావనూరు నుంచి కుంట మార్కెట్‌కు లారీలో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఏఎన్‌ఐ ప్రకారం.. గాయపడిన వ్యక్తులను వెంటనే చికిత్స కోసం సమీప ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
కర్నూలు జిల్లా మంత్రాలయం వేద పాఠశాల నుంచి విద్యార్థులతో వెళ్తున్న వాహనం మంగళవారం అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. తీర్థయాత్ర కోసం హంపి ఆలయానికి వెళుతున్న వాహనం సింధనూరు సమీపంలో బోల్తా పడిన ఘటనలో డ్రైవర్‌తో పాటు ముగ్గురు విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. 14 మంది విద్యార్థుల బృందం నరహరి తీర్థాన్ని పూజించేందుకు బయలుదేరిన సమయంలో ప్రమాదం జరిగింది. బాధితుల్లో డ్రైవర్ శివ, అభిలాష, హైవదన, సుజేంద్ర అనే విద్యార్థినులు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మృతులతో పాటు పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. అత్యవసర సేవల బృందం వెంటనే స్పందించి, క్షతగాత్రులను సింధనూరు ఆసుపత్రికి తరలించింది. ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.