దారుణం.. ఒమిక్రాన్‌ భయంతో.. భార్య, ఇద్దరు పిల్లలను హత్య చేసిన ఫొరెన్సిక్‌ ప్రొఫెసర్.!

Kanpur forensics professor kills his family flees cites omicron. కాన్పూర్ మెడికల్ కాలేజీకి చెందిన సీనియర్ ఫోరెన్సిక్స్ ప్రొఫెసర్ తన భార్యను గొంతు కోసి, తన ఇద్దరు పిల్లల పుర్రెలను సుత్తితో పగలగొట్టి చంపాడు.

By అంజి  Published on  4 Dec 2021 11:01 AM IST
దారుణం.. ఒమిక్రాన్‌ భయంతో.. భార్య, ఇద్దరు పిల్లలను హత్య చేసిన ఫొరెన్సిక్‌ ప్రొఫెసర్.!

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని కాన్పూర్‌లో దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటు చేసుకుంది. కొత్తగా వెలుగు చూసిన కరోనా వేరియంట్‌ ఒమిక్రాన్‌పై భయంతో కాన్పూర్ మెడికల్ కాలేజీకి చెందిన సీనియర్ ఫోరెన్సిక్స్ ప్రొఫెసర్ తన భార్యను గొంతు కోసి, తన ఇద్దరు పిల్లల పుర్రెలను సుత్తితో పగలగొట్టి చంపాడు. కాన్పూర్‌లోని కళ్యాణ్‌పూర్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. నగరంలోని ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న నిందితుడు.. మొదట తన భార్యను గొంతు కోసి, ఆపై కొడుకు, కుమార్తెను సుత్తితో పుర్రెలను పగులగొట్టి హత్య చేశాడు.

తన ఫ్యామిలీకి ఒమిక్రాన్‌ వేరియంట్‌ సోకిందనే భయంతో నిందితుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఆ తర్వాత ఇంటి నుంచి పారిపోయాడని పోలీసు వర్గాలు తెలిపాయి. ఇంటి నుండి పారిపోయే ముందు, ఆ వ్యక్తి తన సోదరుడికి వాట్సాప్ ద్వారా జరిగిన దారుణాన్ని తెలియజేసాడు. ఆ వెంటనే నిందితుడి సోదరుడు ఘటనా స్థలికి చేరుకున్నాడు. ఫ్లాట్‌ తలుపులు పగులగొట్టి చూడగా లోపల ప్రొఫెసర్ భార్య చంద్రప్రభ (50), కుమారుడు శిఖర్ సింగ్ (21) కుమార్తె ఖుషీ సింగ్ (16) మృతదేహాలు కనిపించాయి. వెంటనే అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అధికారులు ఫోరెన్సిక్ బృందం, డాగ్ స్క్వాడ్‌తో సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

"కరోనా మృతదేహాలను లెక్కించడంలో విసిగిపోయానని, ఓమిక్రాన్ ద్వారా ఎవరూ తప్పించుకోలేరని, ఈ క్రమంలోనే తన కుటుంబానికి విముక్తి చేస్తున్నానని" నిందితుడు తన సోదరుడిని పంపిన మెసేజ్‌లో పేర్కొన్నాడు. అయితే నిందితుడు చాలా కాలంగా మానసిక వ్యాధితో బాధపడుతున్నాడని కుటుంబీకుల ద్వారా తెలిసింది. డిప్రెషన్‌లో ఓసారి తన భార్యపై హత్యాయత్నం చేశాడని పోలీసులు దర్యాప్తులో తేలింది. ప్రొఫెసర్‌ను కనిపెట్టేందుకు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. అయితే ఆ కుటుంబానికి నిజంగానే కరోనా సోకిందా లేదా.. ప్రొఫెసర్‌ మానసిక రుగ్మతతోనే ఈ దారుణానికి పాల్పడ్డాడా అనేది తెలియాల్సి ఉంది.

Next Story