వృద్ధ దంపతుల హత్య కేసును చేదించిన పోలీసులు

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం పరిధిలోని కందుకూరు మండలం లోని దాసర్లపల్లి గ్రామంలో ఇద్దరు వృద్ధ దంపతులను హత్య చేసిన కేసును చేదించిన పోలీసులు ఒకరిని అరెస్టు చేశారు

By Medi Samrat  Published on  19 Oct 2024 6:04 PM IST
వృద్ధ దంపతుల హత్య కేసును చేదించిన పోలీసులు

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం పరిధిలోని కందుకూరు మండలం లోని దాసర్లపల్లి గ్రామంలో ఇద్దరు వృద్ధ దంపతులను హత్య చేసిన కేసును చేదించిన పోలీసులు ఒకరిని అరెస్టు చేశారు. చింతలపల్లి మనోహర్ రావు (67) అనే వ్యక్తికి ఎనిమిది ఎకరాల మామిడి తోట, పొలం ఉంది. మామిడి తోట పనులు, పొలం పనులు చూసుకునేందుకు మూగ ఉషయ్య, అతని భార్య మూగ శాంతమ్మ అనే దంపతులను నియమించుకున్నాడు. అయితే మనోహర్ తన తోటలో పనిచేస్తున్న ఉషయ్య, శాంతమ్మకు ఫోన్ చేయ‌గా.. లిఫ్ట్ చేయకపోవడంతో వెంటనే అనుమానం వచ్చి మహేందర్ అనే వ్యక్తికి కాల్ చేసి విషయం చెప్పాడు. మహేందర్ పొలం వద్దకు వెళ్లి చూడగా రక్తం మడుగులో పడి ఉన్న ఉషయ్య మృతదేహం కనిపించింది. అలాగే మంచం మీద రక్తం మడుగులో పడి ఉన్న శాంతమ్మ కనిపించింది.

దీంతో భయభ్రాంతులకు గురైన‌ మహేందర్ వెంట‌నే యజమాని మనోహర్‌కు, పోలీసుల‌కు విషయం తెలియజేశాడు. విషయం తెలుసుకున్న వెంటనే క్లూస్ టీం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ కొనసాగించారు. అయితే 18వ తేదీన మధ్యాహ్నం సమయంలో నేదునూరు క్రాస్ రోడ్ వద్ద నిందితుడు ఉప్పల శివకుమార్(25) అనే యువకుడు అనుమానస్పదంగా కనిపించడంతో అతన్ని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారణ చేయడంతో అతడే ఈ వృద్ధ దంపతులను హత్య చేసినట్లుగా నిర్ధారణ అయింది. దీంతో పోలీసులు అతన్ని కోర్టులో హాజ‌రుప‌ర‌చ‌గా.. జ‌డ్జి రిమాండ్ విధించారు. దీంతో అత‌డ‌ని జైలుకు త‌ర‌లించారు.

Next Story