ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్ లో బెట్టింగ్ లకు పాల్పడే వారిపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెడుతూ ఉంటారు. అయితే పోలీసులే బెట్టింగ్ కు పాల్పడుతున్నారని ఓ నేత సంచలన ఆరోపణలు చేశారు. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లకు సంబంధించి కొంతమంది వ్యక్తులు బెట్టింగ్‌లో పాల్గొంటున్నారని, అది కూడా ముంబై పోలీసుల పరిధిలోనే జరుగుతోందని శివసేన (యుబిటి) శాసనసభ్యుడు, మహారాష్ట్ర శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడు అంబదాస్ దన్వే ఆరోపించారు.
ఎగువ సభలో మాట్లాడుతూ, అనేక సంభాషణలు, బెట్టింగ్ కార్యకలాపాలకు సంబంధించిన రుజువు వివరాలను కలిగి ఉన్న పెన్ డ్రైవ్‌ను తాను సమర్పిస్తానని అంబదాస్ దన్వే కౌన్సిల్ ఛైర్మన్‌కు చెప్పారని వార్తా సంస్థ పిటిఐ నివేదిక తెలిపింది. 2025 సంవత్సరానికి గానూ ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ మార్చి 22, శనివారం ప్రారంభమైంది.
"క్రికెట్ మ్యాచ్‌లపై బెట్టింగ్ కోసం ఉపయోగించే 'లోటస్ 24' అనే అప్లికేషన్ ఫోన్ కాల్ వివరాలు ఉన్న పెన్ డ్రైవ్ నా దగ్గర ఉంది. మెహుల్ జైన్, కమలేష్ జైన్, హిరేన్ జైన్‌లకు పాకిస్తాన్ తో సంబంధాలు ఉన్నాయి. ఇందులో ముంబై పోలీసు సీనియర్ పోలీసు అధికారులు కూడా ఉన్నారు. బెట్టింగ్ కార్యకలాపాలు ముంబై పోలీసుల సంరక్షణలో జరుగుతున్నాయి" అని దాన్వే పేర్కొన్నారు. ఈ విషయంలో ముంబై పోలీసులు ఇంకా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.