కెనెడాలో భారతీయుడి దారుణ హత్య
కెనడాలోని ఒట్టావా నగరం సమీపంలో ఓ భారతీయ పౌరుడిని కత్తితో పొడిచి చంపారు.
By Medi Samrat
కెనడాలోని ఒట్టావా నగరం సమీపంలో ఓ భారతీయ పౌరుడిని కత్తితో పొడిచి చంపారు. ఈ ఘటనకు సంబంధించి ఓ అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన రాక్‌ల్యాండ్‌లో జరిగినట్లు కెనడా రాజధాని ఒట్టావాలోని భారత హైకమిషన్ తెలిపింది. అయితే బాధితుడి వివరాలను హైకమిషన్ వెల్లడించలేదు. "ఒట్టావా సమీపంలోని రాక్‌ల్యాండ్‌లో కత్తిపోట్లకు గురై భారతీయ జాతీయుడు విషాదకరంగా మరణించడం మాకు చాలా బాధ కలిగించింది. అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు నివేదించారు" అని హైకమిషన్ శుక్రవారం ట్విట్టర్‌లో ఒక పోస్టింగ్‌లో పేర్కొంది.
బాధిత కుటుంబానికి అన్ని విధాలా సహాయాన్ని అందించడానికి స్థానిక కమ్యూనిటీ అసోసియేషన్ ద్వారా మేము సంప్రదింపులు జరుపుతున్నామని పోస్ట్ పేర్కొంది. CTV న్యూస్ ప్రకారం.. ఒంటారియో ప్రొవిన్షియల్ పోలీస్ (OPP) రాక్‌ల్యాండ్‌లోని లాలోండే స్ట్రీట్ సమీపంలో శుక్రవారం నాడు మధ్యాహ్నం 3 గంటల సమయంలో కత్తి పోట్లకు పాల్పడినట్లు తెలిపారు.
ఈ ప్రదేశం ఒట్టావా నగరానికి తూర్పున 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. అదుపులోకి తీసుకున్న వ్యక్తిపై ఎలాంటి అభియోగాలు మోపారనే విషయాన్ని పోలీసులు ఇంకా వెల్లడించలేదని నివేదిక పేర్కొంది. ప్రజల భద్రతపై ఎలాంటి ఆందోళన లేదని OPP తెలిపింది. "దర్యాప్తు ప్రారంభ దశలో ఉన్నందున.. తదుపరి సమాచారం ఏదీ విడుదల చేయబడదు" అని అంటారియో ప్రావిన్షియల్ పోలీసులను ఉటంకిస్తూ CTV న్యూస్ పేర్కొంది.