ధూమ్-2 రేంజి దొంగతనం చేశాడు.. చివరికి పడిపోయాడు..!
బాలీవుడ్ చిత్రం 'ధూమ్ 2'లో హృతిక్ రోషన్ మ్యూజియం లోపలికి వెళ్లి అరుదైన వజ్రాన్ని ఎలా దొంగతనం చేస్తాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు
By Medi Samrat Published on 4 Sept 2024 9:30 PM ISTబాలీవుడ్ చిత్రం 'ధూమ్ 2'లో హృతిక్ రోషన్ మ్యూజియం లోపలికి వెళ్లి అరుదైన వజ్రాన్ని ఎలా దొంగతనం చేస్తాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఆ సినిమా చూసి ఇన్స్పిరేషన్ పొందిన ఓ వ్యక్తి భోపాల్‌లోని మ్యూజియం నుండి ₹ 15 కోట్ల విలువైన బంగారాన్ని దొంగిలించడానికి ప్రయత్నించాడు. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ చోటు చేసుకుంది. మ్యూజియం నుండి బయటకు వెళ్లలేక.. దొంగ అపస్మారక స్థితిలో దొరికిపోయాడు. అతని పక్కన పురాతన బంగారు నాణేలు, నగలు వంటి అమూల్యమైన కళాఖండాలు ఉన్నాయి.
వృత్తిరీత్యా దొంగ అయిన వినోద్ యాదవ్ ఆదివారం సాయంత్రం టిక్కెట్ తీసుకుని మ్యూజియంలోకి ప్రవేశించి మ్యూజియం మూసే వరకు లోపలే దాక్కోగలిగాడు. సోమవారం మ్యూజియం మూసివేయగా.. ఈ సమయంలో యాదవ్ రెండు గ్యాలరీ గదుల్లోకి చొరబడి కళాఖండాలను దొంగిలించాడని పోలీసులు భావిస్తున్నారు. మంగళవారం ఉదయం 10.30 గంటలకు మ్యూజియాన్ని తిరిగి తెరిచినప్పుడు పగిలిన అద్దాలు, పలు విలువైన వస్తువులు మాయమైనట్లు సిబ్బంది గుర్తించారు. భద్రతా సిబ్బంది వెంటనే మ్యూజియం ప్రాంగణంలో వెతకడం ప్రారంభించారు. ఆ సమయంలో వినోద్ యాదవ్ హాలులో అపస్మారక స్థితిలో పడి ఉండడాన్ని గమనించారు. దొంగిలించిన కళాఖండాలతో నిండిన పెద్ద బ్యాగ్ అతడి పక్కనే ఉంది. ఆ సంచిలో గుప్తుల కాలం నాటి బంగారు నాణేలు, నగలు, పాత్రలతో పాటు బ్రిటీష్, నవాబుల కాలానికి చెందిన ఇతర వస్తువులు కూడా ఉన్నాయి. తప్పించుకునే ప్రయత్నంలో యాదవ్ 23 అడుగుల ఎత్తు నుండి పడిపోయి ఉండవచ్చని భావిస్తున్నారు. అతని కాలికి గాయమై ఉంటుందని తెలుస్తోంది.
పోలీసు అధికారులు మ్యూజియం నుంచి దాదాపు 50 వేలిముద్రలు సేకరించినట్లు తెలిపారు. రికవరీ చేసిన వస్తువులలో ఒక్కొక్కటి 50 నుండి 100 గ్రాముల బరువున్న బంగారు నాణేలు ఉన్నాయి. వాటి విలువ ₹ 8 నుండి 10 కోట్ల వరకు ఉంటుందని అంచనా. డిసిపి ఇక్బాల్ మాట్లాడుతూ, రికవరీ చేసిన వస్తువుల మొత్తం విలువ సుమారు 15 కోట్ల రూపాయలు ఉంటుందని తెలిపారు.