మణిపూర్‌లో జరుగుతున్న హింసాకాండలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఓ వైపు పరిస్థితి అదుపులో ఉందని ప్రభుత్వం చెబుతూ ఉన్నా గ్రౌండ్ రియాలిటీ వేరేలా ఉంది. ఇంఫాల్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఆదాయపు పన్ను శాఖ అధికారిని అతని అధికారిక నివాసం నుండి బయటకు లాగి మరీ చంపేశారని ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (IRS) అసోసియేషన్ శుక్రవారం తెలిపింది. ఇంఫాల్‌లోని టాక్స్ అసిస్టెంట్, లెట్మిన్‌తాంగ్ హాకిప్ మరణానికి దారితీసిన హింసాత్మక చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపింది. "విధి నిర్వహణలో ఉన్న అమాయక ప్రభుత్వోద్యోగిని హత్య చేయడాన్ని ఏ భావజాలం సమర్థించదు. ఈ క్లిష్ట సమయంలో అతని కుటుంబానికి అండగా ఉంటాము" అని ఐఆర్ఎస్ తన ప్రకటనలో పేర్కొంది.
మణిపూర్ లో ఆల్ ట్రైబల్ స్టూటెండ్స్ యూనియన్ మణిపూర్ (ఏటీఎస్‌యూఎమ్) చేపట్టిన నిరసన హింసాత్మకంగా మారింది. ఏటీఎస్‌యూఎం ఆధ్వర్యంలో నిరసనకు దిగారు. ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్‌తో సమావేశమై రాష్ట్ర సచివాలయం నుంచి తిరిగి వస్తుండగా గురువారం ఇంఫాల్‌లో బీజేపీ ఎమ్మెల్యే వంగ్‌జాగిన్ వాల్టేపై ఆందోళనకారులు దాడి చేశారు. వాల్టే ఇంఫాల్‌లోని తన అధికారిక నివాసానికి వెళుతుండగా ఈ దాడి జరిగింది. దాడిలో ఎమ్మెల్యేతో పాటు ఆయన డ్రైవర్ గాయపడ్డాడు. ఇద్దరినీ వెంటనే ఇంఫాల్ లోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. గాయాలపాలైన ఎమ్మెల్యే పరిస్థితి ఆందోళనకరంగా ఉందని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది. ‘కనిపిస్తే కాల్చివేత’ ఉత్తర్వులను అమలు చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.