దేశవ్యాప్తంగా విడుదలైన సినిమాలను, ఓటీటీ కంటెంట్లను గంటల్లోనే పైరసీ చేసి విడుదల చేస్తున్న 'ఐ-బొమ్మ' నిర్వాహకుడు ఇమ్మడి రవికి హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టు రెండు వారాల రిమాండ్ విధించింది. కూకట్‌పల్లిలోని ఒక ఫ్లాట్‌లో ఉండగా సైబర్ క్రైమ్ పోలీసులు అతడిని అరెస్టు చేశారు. అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. ఇమ్మడి రవిని పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు.
ఇమ్మడి రవి నిన్ననే ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చాడు. కూకట్‌పల్లిలోని రెయిన్ విస్టా ఫ్లాట్‌లో ఉండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతను కరేబియన్ దీవుల్లో ఉంటూ ఐ-బొమ్మ నిర్వహిస్తున్నాడు. అతడి స్వస్థలం విశాఖపట్నం. అతడి ఫ్లాట్ నుంచి పెద్ద మొత్తంలో హార్డ్ డిస్కులు, కంప్యూటర్లు, సినిమాలకు సంబంధించిన హెచ్‌డీ ప్రింట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అప్‌లోడ్ చేయడానికి సిద్ధంగా ఉన్న కొన్ని సినిమాల కంటెంట్‌ను హోల్డ్ చేశారు.