హైదరాబాద్: నగరానికి చెందిన అన్నాచెల్లెలు వారణాసిలో అనుమానాస్పద మృతి చెందిన ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్‌లోని లక్డీకాపూల్ ప్రాంతానికి చెందిన గణేష్ గౌడ్, అతని సోదరి లక్ష్మీదేవి గత నాలుగు రోజులుగా ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి కాంట్ ప్రాంతంలో ఉన్న సిట్ ఇన్ హోటల్‌లో బస చేస్తున్నట్లు సమాచారం.
అయితే గడిచిన రోజు నుంచి వారు గది తలుపులు తెరవకపోవడంతో హోటల్ సిబ్బందికి అనుమానం కలిగింది. పలుమార్లు తలుపు తట్టినా స్పందన లేకపోవడంతో హోటల్ సిబ్బంది వెంటనే పోలీసు లకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గది తలుపులు బలవంతంగా తెరిచి లోపలికి వెళ్లగా, గణేష్ గౌడ్, లక్ష్మీదేవి ఇద్దరూ నోటి నుంచి నురగ కారుతూ అపస్మారక స్థితిలో పడివున్నట్లు గుర్తించారు. వెంటనే వారిని పరిశీలించిన వైద్య సిబ్బంది వారు అప్ప టికే మృతి చెందినట్లు నిర్ధారించారు.
వారి గదిలో విషం బాటిల్ లభించడంతో పోలీసులు ప్రాథమికంగా ఇది ఆత్మహత్యగా భావిస్తున్నారు. అయితే నిజంగానే వారు ఆత్మహత్య చేసుకున్నారా, లేక మరెవరైనా ఈ ఘటనకు కారణమా అన్న కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకొని అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.