హైదరాబాద్ లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్
Hyderabad minor gang-raped in car. హైదరాబాద్ లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ ఘటన తీవ్ర దుమారం రేపుతోంది.
By Medi Samrat Published on 3 Jun 2022 6:18 PM ISTహైదరాబాద్ లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబరు 36లోని అమినీషియా పబ్ కేసు వ్యవహారంలో తనపై అత్యాచారం జరిగిందంటూ బాలిక స్టేట్‌మెంట్ ఇచ్చింది. గత నెల 28న అమినీషియా పబ్‌లో పార్టీకి వెళ్లగా సాయంత్రం 5 గంటలకు గుర్తుతెలియని యువకులు తనను బలవంతంగా కారులో తీసుకెళ్లారని తెలిపింది. రాత్రి 7 గంటలకు జూబ్లీహిల్స్ దగ్గర వదిలిపెట్టారని కారులో తనపై అత్యాచారానికి పాల్పడ్డారని బాలిక తెలిపింది. ఇంటికి వెళ్లిన బాలిక మెడపై గాట్లు ఉండడం గమనించిన తండ్రి ఆమెను ప్రశ్నించగా.. తనపై అత్యాచారం జరిగినట్లు తెలిపింది.
పశ్చిమ మండలం టాస్క్‌ఫోర్స్, జూబ్లీహిల్స్ పోలీసులు సీసీ ఫుటేజీ పరిశీలించగా.. అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాలిక పబ్ నుంచి బయటకు రాగానే కొందరు యువకులు ఆమెను బెంజ్ కారులో ఎక్కించుకున్నారు. అక్కడి నుంచి బంజారాహిల్స్ రోడ్డు నెంబరు 14లోని కాన్సు బేకరీ వద్దకు వెళ్లడం.. కొద్ది సేపటి తరువాత ఇన్నోవా కారులో పబ్‌కు రావడం అనుమానాలకు తావిస్తోంది. కార్లో తనను తీసుకెళ్లిన వ్యక్తులు తనపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారని బాధిత బాలిక పోలీసులకు స్టేట్‌మెంట్ ఇచ్చింది. బాలికపై అత్యాచారానికి పాల్పడిన వారంతా 16 ఏళ్ల వయసు వారేనని పోలీసుల విచారణలో తేలింది. అత్యాచార నిందితుల్లో ప్రజాప్రతినిధుల పిల్లలు ఉన్నట్లు తెలుస్తోంది. ఐదుగురు మైనర్లపై పోలీసులు పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. కారులో ఐదుగురు వ్యక్తులు ఉన్నారని, వారెవరో తనకు తెలియదని బాలిక పోలీసులకు తెలిపింది.