తల్లిదండ్రుల పక్కన నిద్రిస్తున్న ఎనిమిది నెలల చిన్నారి కిడ్నాప్

పేవ్‌మెంట్‌(ఫుట్‌పాత్‌)పై తల్లిదండ్రుల పక్కన నిద్రిస్తున్న ఎనిమిది నెలల చిన్నారిని కిడ్నాప్ చేసిన వ్యక్తిని సనత్‌నగర్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.

By Medi Samrat  Published on  25 Feb 2025 8:32 PM IST
తల్లిదండ్రుల పక్కన నిద్రిస్తున్న ఎనిమిది నెలల చిన్నారి కిడ్నాప్

పేవ్‌మెంట్‌(ఫుట్‌పాత్‌)పై తల్లిదండ్రుల పక్కన నిద్రిస్తున్న ఎనిమిది నెలల చిన్నారిని కిడ్నాప్ చేసిన వ్యక్తిని సనత్‌నగర్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. చిన్నారిని రక్షించి తల్లిదండ్రులకు అప్పగించారు. కిడ్నాప్‌కు గురైన చిన్నారి తల్లిదండ్రులు ఉత్తరప్రదేశ్‌కు చెందిన కలివల గీత, రాధే ఉపాధి కోసం కొన్ని నెలల క్రితం హైదరాబాద్‌కు వలస వచ్చారు. సనత్‌నగర్‌లోని ఫతేనగర్‌ శివాలయం రోడ్డులో చెత్తను సేకరించి జీవనోపాధి పొందేవారు.

ఫిబ్రవరి 22వ తేదీ రాత్రి ఫతేనగర్ శివాలయం రోడ్డులోని విపిన్ ఇండస్ట్రీస్ ముందు ఫుట్‌పాత్‌పై తమ బిడ్డతో కలిసి నిద్రిస్తుండగా, బీహార్‌లోని చాప్రా జిల్లాకు చెందిన సత్యనారాయణ రామ్ (43), సన్నీ కుమార్ పాండే (24)లు బిడ్డను కిడ్నాప్ చేశారు. సత్యనారాయణ బాలానగర్‌లో ఉంటూ ట్రాలీ ఆటో నడుపుతూ ఉంటాడు.

మంగళవారం నాడు బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ ఈ కిడ్నాప్ వ్యవహారంపై స్పందించారు. తెల్లవారుజామున 2.30 గంటలకు బాలుడిని కిడ్నాప్ చేసినట్లు తెలిపారు. కిడ్నాపర్లు పసికందు ఏడుపు ఆపేందుకు ముందుగా తెచ్చిన పాల డబ్బాను వాడారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్న సీసీ కెమెరాలను పరిశీలించారు. ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తులు బాలుడిని కిడ్నాప్ చేసినట్లు నిర్ధారణ అయింది.

సత్యనారాయణ రామ్‌కు పెళ్లయి 20 ఏళ్లయినా పిల్లలు లేరు. ఎన్ని ప్రయత్నాలు చేసినా పిల్లలు పుట్టలేదు. ఇంటికి వెళుతున్న సమయంలో సత్యనారాయణ బాలుడిని గమనించి, అతన్ని ఎత్తుకుని వెళ్లి తన కొడుకుగా పెంచుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఫిబ్రవరి 23న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఇద్దరిని అరెస్టు చేసి బాలుడిని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు.

Next Story