శోభనం రాత్రి మిగిల్చిన విషాదం.. నవవధువు ఆత్మహత్యా యత్నం
Hyderabad girl suicide. పెళ్లయి మూడు రోజులు.. సంప్రదాయబద్ధంగా శోభనం జరిపించాలని పెద్దలు నిశ్చయించారు.
By Medi Samrat Published on 11 Dec 2020 6:03 PM IST
పెళ్లయి మూడు రోజులు.. సంప్రదాయబద్ధంగా శోభనం జరిపించాలని పెద్దలు నిశ్చయించారు. మరపురాని రోజుగా నిలవాల్సిన శోభనం రాత్రి ఆ దంపతుల మధ్య చిచ్చు రాజేసింది. భార్య మనసు తెలుసుకోని భర్త ఆమె తనకు సహకరించడం లేదంటూ పెద్దలకు చెప్పాడు. అందరికీ తెలిసిపోయిందని మనస్థాపానికి గురైన నవవధువు ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ఈ విషాదకర సంఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది.
అసలేం జరిగింది?
తూర్పుగోదావరి జిల్లాలోని కాట్రేనికోన మండలం బొట్టుచెరువు గ్రామానికి చెందిన స్వామి బతుకుదెరువు కోసం హైదరాబాద్ నగరంలోని జగద్గిరిగుట్ట ప్రాంతం ప్రగతినగర్‌కు వచ్చాడు. మేస్త్రీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న స్వామికి ఇద్దరు కుమార్తెలు. పెళ్లి ఈడు రావడంతో పెద్ద కుమార్తె సౌజన్యను ఈ నెల 6న తమ స్వగ్రామం బొట్టుచెరువు గ్రామంలోనే వెంకటేశ్వరరావు అనే యువకుడికి ఇచ్చి వివాహం చేశాడు. 9వ తేదీ రాత్రి హైదరాబాద్‌లో శోభనానికి ముహూర్తం కూడా పెట్టారు. అప్పటి వరకు అంతా సవ్యంగానే సాగిన తంతు శోభనం రోజు రాత్రికి బెడిసికొట్టింది. శోభనం గదిలో నుంచి పొద్దున్నే బయటకు వచ్చిన వరుడు వెంకటేశ్వరరావు వధువు శోభనానికి సహకరించలేదని పెద్దలకు చెప్పాడు. దీంతో కుటుంబ సభ్యులు వధువును ఈ విషయమై ప్రశ్నించేటప్పటికి మనస్తాపానికి గురైన సౌజన్య ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబసభ్యులు సౌజన్యను వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. శోభనం రోజు రాత్రి గొడవ జరిగిందని.. ఆ కారణంతోనే తమ కుమార్తె ఆత్మహత్య యత్నానికి పాల్పడిందని సౌజన్య తల్లిదండ్రులు జగద్గిరిగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసలు ఆ శోభనం రోజు రాత్రి ఏమైందన్న విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.