హైదరాబాద్: ఓ మహిళను బట్టలు ఉతకడానికి ఇంటికి పిలిచి.. ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్ కి చెందిన చందు (25), అజయ్ (25), ఆరిఫ్ (35) జీవనోపాధి నిమిత్తం నగరానికి వచ్చి మధురానగర్ లో నివాసం ఉంటున్నారు. ఈ ముగ్గురు నిందితులు... కూలి పని కోసం వెళ్తున్న ఒక మహిళను ఆపి బట్టలు ఉతకాడానికని ఇంటికి రమ్మని పిలిచారు. కూలి పని లేకపోవడంతో వారు చెప్పిన పనికి ఒప్పుకున్న సదరు మహిళ ఆ ముగ్గురు ఉంటున్న ఇంటికి వెళ్ళింది.
ఇంట్లో పని చేస్తున్న సమయంలో ఈ ముగ్గురు కామాంధులు మహిళపై ఒక్క సారిగా దాడి చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మహిళ భయపడి పోయి తనను వదిలి పెట్టాలంటూ ప్రాధేయపడిన కూడా కామాంధులు వినకుండా ఆమెపై అఘాయిత్యానికి పూనుకున్నారు. అనంతరం సదరు మహిళ మధుర నగర్ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని... ఇంతటి అఘాయిత్యానికి పాల్పడిన ఆ ముగ్గురు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టగా గచ్చిబౌలి బయోడైవర్సిటీ వద్ద ఆ ముగ్గురు కనిపించారు. దీంతో పోలీసులు వెంటనే వారిని అరెస్టు చేశారు. మధురానగర్ పోలీసులు కేవలం 24 గంటల్లోనే నిందితులను అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టేశారు.