హైదరాబాద్‌లోని అపార్ట్‌మెంట్లలో నాసిరకం లిఫ్టులు ప్రాణాలను బలిగొంటున్నాయి. మెహదీపట్నంలోని ముజ్‌తాబా అపార్ట్‌మెంట్ లిఫ్ట్‌లో ఇరుక్కుని నాలుగున్నరేళ్ల బాలుడు సురేందర్ మరణించాడు. బుధవారం రాత్రి ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు..అపార్ట్‌మెంట్‌లో తల్లిదండ్రులు, సోదరితో బాలుడు సురేందర్ ఉంటున్నాడు. తండ్రి శామ్ బహదూర్ అదే అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మన్‌గా పని చేస్తున్నాడు. ఆరు ఫ్లోర్లు ఉన్న భవనంలోనే హాస్టల్ నిర్వహిస్తున్నారు. శామ్ బహదూర్ లిఫ్ట్ పక్కనే ఉన్న చిన్న రూమ్‌లో పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు.
అయితే బుధవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో సురేందర్ ఆడుకుంటూ లిఫ్ట్ మధ్యకు వెళ్లాడు..దీనిని ఎవరూ గుర్తించలేదు. కాసేపటి తర్వాత బాలుడి జాడ కోసం వెతకగా లిఫ్ట్ మధ్యలో ఇరుక్కుని అపసార్మక స్థితిలో పడి ఉన్నాడు. బాలుడిని చూసిన తల్లిదండ్రులు రోదిస్తుండగా..అపార్ట్‌మెంట్ వాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు లిఫ్ట్‌లో ఇరుక్కున్న బాలుడిని బయటికి తీసి హుటాహుటిన హాస్పిటల్‌కు తరలించారు. అయితే అప్పటికే చనిపోయాడని డాక్టర్లు నిర్ధారించారు.