Hyderabad: రోడ్డు ప్రమాదంలో చెలరేగిన మంటలు.. తండ్రీకుమారుడి మృతి

హైదరాబాద్‌ నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బైకు - టిప్పర్‌ ఢీ కొన్న ఈ ఘటనలో తండ్రీ కొడుకు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.

By అంజి  Published on  5 Jan 2024 11:37 AM IST
Hyderabad, fire, road accident

Hyderabad: రోడ్డు ప్రమాదంలో చెలరేగిన మంటలు.. తండ్రీకుమారుడి మృతి 

హైదరాబాద్‌ నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బైకు - టిప్పర్‌ ఢీ కొన్న ఈ ఘటనలో తండ్రీ కొడుకు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు తెల్లవారుజామున చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో మంటలు చెలరేగాయి. టిప్పర్ బైక్ కాలి బూడిద అయ్యాయి. కుత్బుల్లాపూర్‌కు చెందిన కుత్తడి కుమార్, అతని కుమారుడు ప్రదీప్ (ఏడవ తరగతి చదువుతున్నాడు) ఎలక్ట్రిక్ బైక్ పై వెళ్తున్న సమయంలో నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌరెల్లి పాపాయిగూడ చౌరస్తాకు రాగానే మితిమీరిన వేగంతో ఎదురుగా వచ్చిన టిప్పర్ లారీ బైకును ఢీ కొట్టింది.

దీంతో ఒక్కసారిగా టిప్పర్ లారీ క్యాబిన్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో టిప్పర్ లారీ, ఎలక్ట్రిక్ బైక్ పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో బాలుడు ప్రదీప్ సజీవ దహనం కాగా.. తండ్రి కుమార్‌కు కూడా తీవ్ర గాయాలు కావడంతో ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఒకే కుటుంబంలో తండ్రి, కొడుకు చనిపోవడంతో ఆ ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే టిప్పర్ లారీ డ్రైవర్ పరారయ్యాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Next Story