Telangana : భార్యను హత్య చేసి కుక్కర్లో ఉడక పెట్టిన కసాయి భర్త
భార్యను అతికిరాతకంగా హత్య చేశాడు ఓ భర్త. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆమెను దారుణంగా హత్య చేశాడు.
By Medi Samrat Published on 22 Jan 2025 9:07 PM ISTభార్యను అతికిరాతకంగా హత్య చేశాడు ఓ భర్త. భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆమెను దారుణంగా హత్య చేశాడు. హత్య చేసిన అనంతరం డెడ్ బాడీ ముక్కలుగా చేసి కుక్కర్లో వేసి ఉడక పెట్టాడు. ఆపై ఆ ముక్కలను చెరువులో పడేశాడు. ఈ సంఘటన రాచకొండ కమిషనరేట్ మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మృతురాలి తల్లిదండ్రులు మీర్ పేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన స్థానికులను భయభ్రాంతులకు గురి చేసింది.
వివరాల్లోకి వెళ్తే.. ప్రకాశం జిల్లా జేపీ చెరువుకు చెందిన గురుమూర్తి(EX- ఆర్మీ) వృత్తి రీత్యా DRDOలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తూ.. జిల్లెల్లగూడలోని న్యూ వెంకటేశ్వర నగర్ కాలనీలో భార్య వెంకట మాధవి(35)తో కలిసి నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. సాఫీగా సాగిపోతున్న వీరి సంసారంలోకి అనుమానం అనే భూతం వచ్చింది. దీంతో గురుమూర్తి భార్య వెంకట మాధవిని అనుమానించేవాడు. ఇదే విషయమై దంపతుల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణ చెలరేగింది. దీంతో ఆగ్రహానికి లోనైనా గురుమూర్తి భార్యను అతి కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం భార్య మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేశాడు. కమర్షియల్ సిలిండర్ తీసుకొని వచ్చి ఆ ముక్కలను ఉడకబెట్టాడు. అనంతరం ఆ మొక్కలను ఎండబెట్టి రోకలితో పొడిగా మార్చాడు. ఆ విధంగా మృతదేహం పొడిని బకెట్లో తీసుకువెళ్లి జిల్లెలగూడ చెరువులో కలిపివేశాడు. సంక్రాంతి పండగ మూడు రోజుల పాటు గురుమూర్తి భార్యను చంపి ఆ మృతదేహాన్ని కట్ చేసి ఉడకబెట్టి.. ఎండబెట్టి పొడిచేసి చెరువులో కలిపాడు.
ఈనెల 13వ తేదీ మాధవి మిస్సింగ్ అయినట్టు మీర్ పేట్ పోలీస్ స్టేషన్లో మృతురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు సమయంలో తనకు ఏం తెలియదన్నట్టుగా అత్తమామలతో కలిసి మీర్ పేట్ పీఎస్కు మృతురాలి భర్త కూడా వెళ్లాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మాధవి కోసం గాలింపు చర్యలు చేస్తున్న సమయంలో.. గురుమూర్తిపై పోలీసులకు అనుమానం వచ్చింది.. దీంతో గురుమూర్తిని అదుపులోకి తీసుకొని తమదైన స్టైల్లో విచారించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు మృతదేహం పొడి కోసం చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. కానీ ముక్కలతో పాటు బాడీ మొత్తాన్ని పొడిగా మార్చడం వల్ల ఆనవాళ్లు దొరకలేదు. పోలీసులు గురు మూర్తిని అరెస్టు చేసి రిమాండ్కు పంపించారు.