యజమాని ఇంట్లో ఫేక్ ఈడీ రైడ్ ప్లాన్ చేసిన పని మనిషి..!
ఢిల్లీలోని న్యూ ఫ్రెండ్స్ కాలనీకి చెందిన ప్రముఖ ఆర్కిటెక్ట్ ఆర్సీ సభర్వాల్, ఉష సభర్వాల్ దంపతుల ఇంట్లో ఓ భారీ చోరీ జరిగింది.
By - Medi Samrat |
ఢిల్లీలోని న్యూ ఫ్రెండ్స్ కాలనీకి చెందిన ప్రముఖ ఆర్కిటెక్ట్ ఆర్సీ సభర్వాల్, ఉష సభర్వాల్ దంపతుల ఇంట్లో ఓ భారీ చోరీ జరిగింది. నకిలీ ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) అధికారుల పేరుతో దుండగులు వారి ఇంట్లో చొరబడి నగదు, ఆభరణాలు దోచుకెళ్లారు. ఫిబ్రవరి 11 ఉదయం 10:30 గంటల సమయంలో ముగ్గురు వ్యక్తులు తాము ఈడీ అధికారులమని, సోదాలు చేయడానికి వచ్చామని నమ్మించారు. ఇల్లంతా వీడియో తీస్తూ, దంపతుల ఫోన్లను లాక్కుని కబోర్డ్‌లోని విలువైన వస్తువులు, నగదును తీసుకోవడం ప్రారంభించారు.
అయితే ఆ ఉషా సభర్వాల్ చాకచక్యంగా వ్యవహరించారు. వాళ్లకు తెలియకుండా తన దగ్గర ఉన్న మరో ఫోన్‌తో బాత్రూమ్‌కి వెళ్లి, ఈడీలో లాయర్‌గా పనిచేస్తున్న తన మనవడు గౌరవ్‌కు ఫోన్ చేశారు. అది 'ఫేక్ ఈడీ టీమ్' అని నిర్ధారించాడు. ఆమె తిరిగి వచ్చి మా వాళ్ళల్లో ఈడీ లాయర్ ఉన్నారు, అతను ఇప్పుడే ఇక్కడికి వస్తున్నాడని చెప్పడంతో ఆ నకిలీ అధికారులు భయపడి ఇంట్లోని రూ. 3-4 లక్షల నగదు, 7 ఖరీదైన వాచీలు, కొంత బంగారంతో అక్కడి నుంచి ఉడాయించారు. రంగంలోకి దిగిన పోలీసులు సుమారు 300కు పైగా సీసీటీవీ కెమెరాలను పరిశీలించి, నిందితులు వాడిన కారు ఘజియాబాద్‌లోని వైశాలి (సెక్టార్ 4) లో ఉన్నట్లు గుర్తించారు. ఈ కేసును దర్యాప్తు చేయగా అసలు నిజం బయటపడింది. ఆ దంపతుల ఇంట్లో రెండేళ్లుగా పనిచేస్తున్న పనిమనిషి 'రేఖా దేవి', ఆమె వదిన 'పూజా రాజ్‌పుత్' ఈ దోపిడీకి మాస్టర్ మైండ్స్‌గా పోలీసులు గుర్తించారు!
పూజా రాజ్‌పుత్ భర్త మనీష్ పారామిలటరీ కానిస్టేబుల్ గా గతంలో పని చేశాడు, తన స్నేహితుడు ఉపదేశ్ థాపాతో కలిసి పక్కా ప్లాన్ ప్రకారం ఫేక్ ఐడీ కార్డులు, యూనిఫాంతో ఈ చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో డబ్బులు ఎక్కడ ఉంటాయో పనిమనిషి రేఖ వాళ్లకు ముందే సమాచారం ఇచ్చింది. పోలీసులు పనిమనిషి రేఖను, ఆమె వదిన పూజా రాజ్‌పుత్‌ను అరెస్ట్ చేయగా, ప్రధాన నిందితులైన మనీష్, ఉపదేశ్ పరారీలో ఉన్నారు.