ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో పోలీసులు సస్పెండ్ అయిన ఒక కళాశాల చీఫ్ ప్రాక్టర్ కోసం వెతుకుతున్నారు. అతను విద్యార్థినులను లైంగికంగా వేధించినట్లు, వారిని బ్లాక్‌మెయిల్ చేయడానికి చర్యలను రికార్డ్ చేసినట్లు తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. సేథ్ ఫూల్ చంద్ బాగ్లా పీజీ కాలేజీకి చీఫ్ ప్రాక్టర్ గా ఉన్న రజనీష్ కుమార్ ఈ దారుణాలు చేశాడు. అతడి మీద ఆరోపణలు వెలుగులోకి వచ్చిన తర్వాత కళాశాల అధికార యంత్రాంగం అతన్ని సస్పెండ్ చేసింది. రజనీష్ కుమార్ ఇప్పుడు పరారీలో ఉన్నాడు. పోలీసులు అతని కోసం వెతుకుతున్నారు.
కళాశాల విద్యార్థులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి, కఠినమైన శిక్ష విధించాలంటూ డిమాండ్లు వినిపిస్తూ ఉన్నాయి. సుమారు 10 నెలల క్రితం.. రజనీష్ కుమార్ మార్కులు వేయడం, ఉద్యోగ అవకాశాల కోసం విద్యార్థులను లైంగిక చర్యలకు బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని ఆరోపిస్తూ పోలీసులకు ఒక అనామక లేఖ వచ్చింది. ఆ లేఖలో అతడి మీద చర్యలు తీసుకోవాలని కళాశాల యాజమాన్యాన్ని కోరినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని తెలిపారు.
అనామక లెటర్ తో పాటు రజనీష్ కుమార్ విద్యార్థులతో సన్నిహితంగా ఉన్న 59 వీడియోలతో కూడిన పెన్ డ్రైవ్ కూడా జతచేశారు. విద్యార్థుల గుర్తింపును కాపాడుకోవడానికి వారి ముఖాలను దాచిపెట్టారు. రజనీష్ కుమార్ రహస్య కెమెరాతో ఈ చర్యలను రికార్డ్ చేసి, తరువాత బాధితులను సన్నిహితంగా ఉండేలా బ్లాక్ మెయిల్ చేసేవాడని తెలిసింది.